స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కార్మీక సంఘాల ఆగ్రహం
నాలుగు గంటల తర్వాత స్పందిస్తారా?
తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
కార్మీకులను ఆదుకోవాలి.. భద్రతా చర్యలు చేపట్టాలి
డిమాండ్ చేసిన పలువురు కార్మిక నేతలు
ఉక్కునగరం(విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత యాజమాన్య ప్రతినిధులు స్పందించారని ధ్వజమెత్తారు. తీరుబడిగా ఆస్పత్రికి వచ్చి ప్రమాదం దురదృష్టకరమని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్మీకులపై యాజమాన్యం పెనుపనిభారం మోపుతోందని, కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారంపై ఇప్పటికీ పెదవి విప్పడం లేదని, సీఎండీ వచ్చి న తర్వాత ప్రకటిస్తామని, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కార్మీకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు ఏమన్నారంటే..
ఏడాదిగా చెబుతూనే ఉన్నాం
ఏడాదిగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్లే ఈ పెను ప్రమాదం సంభవించింది. 20 మంది ఉండాల్సిన పని ప్రదేశంలో కేవలం 12 మందితో పని చేయించడం దారుణం. పనికిరాని వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – డి.ఆదినారాయణ, ప్రధానకార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతపై దృష్టి సారించకుండా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా కార్మీకులపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తేగలం. తీవ్రమైన ఒత్తిడితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. – మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ
నాణ్యత లేని రా మెటీరియల్ వాడడం వల్లే
నాణ్యత లేని రా మెటీరియల్ వాడడంతో సరైన రసాయన చర్యలు జరగకపోవడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగింది. 20 మంది ఉండాల్సిన ప్రదేశంలో 12 మంది పని చేస్తున్నారు. భద్రతను గాలికి వదిలేశారు. కార్మీకుల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో మృతదేహాలు ఉండటం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. ఇకనైనా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలి. – జె. అయోధ్యరామ్, ప్రధానకార్యదర్శి, స్టీల్ సీఐటీయూ


