మంత్రి లోకేశ్‌తో రాయపూడి కిరణ్ (ఫైల్)
వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి
ఉండవల్లిలో పక్కా స్కెచ్‌తో టీడీపీ మూకల స్వైర విహారం
ఇటీవల పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు
రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీ
ఉండవల్లి వద్ద అడ్డుకుంటూ పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాల దాడులు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లపై బాదుతూ.. బండ రాళ్లు విసురుతూ విధ్వంసం
లోకేశ్ డైరెక్షన్ మేరకు ఆయన పీఏ నేతృత్వంలోనే అరాచకం
టీడీపీ నాయకులకు సహకరించిన పోలీసులు
దాడి కుట్ర ఒక రోజు ముందే తెలిసినా పట్టించుకోని తాడేపల్లి సీఐ
ఫలితంగా రెచ్చిపోయి దాడులు చేసిన మట్టి మాఫియా రౌడీషీటర్లు
రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు.. వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసు
టీడీపీ మూకలు కోడిగుడ్లు విసరడంతో ప్రయాణికులకు సైతం గాయాలు
ప్రభుత్వం, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
సర్కారు దుర్మార్గంపై సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాలు ఆగ్రహం
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్‌లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే...
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్‌కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్‌డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు.
రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్‌లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్‌కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. 
రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్
రైతుల ఆహ్వానం మేరకు..
రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్‌కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
వెఎస్సార్‌సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య
రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి
పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్‌సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.
టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్
ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్‌లో ప్రభుత్వ దాడి
⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్‌టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్‌ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు.
⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు
⇒ వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు.
⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్‌లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.
దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ
⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు.
⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు.
⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


