లోకేశ్‌ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు | Student Union Protest At School Education Commission: Mangalagiri | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు

Jun 6 2025 5:35 AM | Updated on Jun 6 2025 5:35 AM

Student Union Protest At School Education Commission: Mangalagiri

ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులు

వారం రోజుల్లో పూర్తి చేయాలని టీచర్లకు టార్గెట్‌.. విద్యా శాఖ వైఫల్యం బయటపడడంతో వారిపై చర్యలు 

విద్యా వ్యవస్థను భ్రషు్టపట్టించిన మంత్రి లోకేశ్‌

నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. పదోతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి 

విద్యార్థి సంఘాల డిమాండ్‌.. మంగళగిరిలోని పాఠశాల విద్యా భవన్‌ ఎదుట ధర్నా 

వైఎస్సార్‌సీపీ సంఘీభావం

సాక్షి, అమరావతి, మంగళగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాం­కనంలో జరిగిన తప్పులతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యా భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

లోకేశ్‌ అసమర్థత వల్లే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హడావుడికి విద్యార్థులు బలయ్యారని, లోకేశ్‌కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన విద్యా శాఖ, అందులో జరిగిన తప్పులకు టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధర్నాలో వారు ఏమన్నారంటే..

విద్యా శాఖను భ్రష్టు పట్టించారు..
‘‘పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ ఘోరంగా ఫెయిలైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు నిర్వహించే శాఖలోనే పనితీరు ఇంత ఘోరంగా ఉందంటే.. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్కదాంట్లో కేవలం 5, 10, 20 మార్కులతో ఫెయిలవడం, రీకౌంటింగ్‌ లో 90 మార్కులు రావడం చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టుపట్టిందో అర్థమవుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 66,363 మంది రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. 

రికార్డుల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు 
వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఘనతగా చెప్పుకోవాలని భావించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది. సంఖ్యను పెంచకుండా ఉన్నవారితోనే మూల్యాంకనం చేయించడంతో టీచర్లు ఒత్తిడికి లోనయ్యారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో గంగిరెడ్డి మోక్షితకు సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వేశారు. రీకౌంటింగ్‌ లో 84 మార్కులొ­చ్చాయి. బాపట్లలో తేజశ్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులు వస్తే సాంఘిక శాస్త్రంలో 26 మార్కులతో ఫెయిలైంది. రీవెరిఫికేషన్‌ తర్వాత 96 మార్కులొచ్చాయి. రాష్ట్ర చరిత్రలో రీవెరిఫికేషన్‌ తర్వాత కేవలం 5, 10 మార్కులు పెరిగేవి. కానీ, ఇంత దారుణంగా 70 పైగా మార్కులు పెరిగిన సందర్భాలు లేవు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అసమర్థతను తెలియజేస్తుంది.

విద్యార్థుల డబ్బులు తిరిగి చెల్లించాలి
చాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేక, రుసుములు భరించలేక రీవెరిఫికేషన్‌ కు దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. లేదంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండేవేమో? రాజమహేంద్రవరంలో మణికంఠకు మొత్తం 505 మార్కులు రాగా..  హిందీలో 52 మాత్రమే వచ్చాయి. రీవెరిఫికేషన్‌ లో కొన్ని జవాబులను కొట్టేసి ఉన్నట్టు వెల్లడైంది. దీనిపై ప్రశ్నిస్తే అవి సరైన సమాధానాలేనని.. కానీ, విద్యార్థే కొట్టేశాడని చెబుతున్నారు. కష్టపడి రాసిన విద్యార్థి ఎందుకు కొట్టేస్తాడు? మంత్రి లోకేశ్‌ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి.

రెడ్‌ బుక్‌ అమలు మీద పెట్టిన శ్రద్ధ విద్యా శాఖ మీద పెడితే బాగుంటుంది. విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌ కు అవకాశం కల్పించాలి. ఇప్పటికే రుసుములు చెల్లించినవారి డబ్బులు తిరిగివ్వాలి. లోకేశ్‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు టీచర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు’’ అని పానుగంటి చైతన్య, రవిచంద్ర దుయ్యబట్టారు. ధర్నాలో  వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, నాయకులు కోమల్‌ సాయి, గోపీచంద్, ఐ. శ్రీనివాస్, ఎస్కే ఆర్మాన్, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
విద్యా భవన్‌ కు బైక్‌ ర్యాలీగా వస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పరీక్షల విభాగం అధికారి కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి విద్యార్థి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement