వచ్చే ఐదు రోజులు వర్షాలు | Rain likely in several districts for the next five days | Sakshi
Sakshi News home page

వచ్చే ఐదు రోజులు వర్షాలు

Jun 12 2026 4:29 AM | Updated on Jun 12 2026 4:29 AM

Rain likely in several districts for the next five days

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావం విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

సాక్షి, అమరావతి:  రాబోయే ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. 

ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.  దీంతో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

కొవ్వూరులో అత్యధిక ఉష్ణోగ్రత
ఇదిలా ఉండగా గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం
మరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 5.7 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 3.7 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లాలో 3.49 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 3.2, గుంటూరు జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement