బిహార్‌లో టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
నెల్లూరు నుంచి కాశీయాత్రకు వెళ్లిన 43 మంది
ముగ్గురు యాత్రికుల దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు
గయలోని మగధ మెడికల్ కళాశాలలో చికిత్స
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయలుదేరిన టూరిస్టు బస్సు బిహార్ రాష్ట్రంలోని గయ జిల్లా బుద్ధగయ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులోని ముగ్గురు యాత్రికులు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో సంగంకు చెందిన టూరిస్టు బస్సు నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు.
తీవ్రంగా గాయపడిన వారిలో సంగంకు చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డి.రమణమ్మ, జి.శ్రీదేవి, డి.మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు గయలోని అనుగ్రహ నారాయణ మగధ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కాగా క్షతగాత్రులకు హిందీ భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యులు మాత్రం క్షతగాత్రులకు చికిత్స అందించి కాపాడారు. సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

బస్సు ప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


