హామీలపై గళమెత్తిన పొదుపు మహిళలు | - | Sakshi
Sakshi News home page

హామీలపై గళమెత్తిన పొదుపు మహిళలు

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా

సూపర్‌సిక్స్‌ హామీలు అమలు

చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన

నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంపై పొదుపు మహిళలు కన్నెర్ర చేశారు. అధికారంలోకి రావడం కోసం సూపర్‌సిక్స్‌లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ దగ్గర ఉన్న ఏబీఎం కాంపౌండ్‌ నుంచి మెప్మా కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మెప్మా కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మెప్మా పీడీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. అనంతరం పీడీ కిరణ్‌కుమార్‌ ధర్నా వద్దకు విచ్చేసి వినతిపత్రం స్వీకరించారు. నెలరోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు.

● ఈ సందర్భంగా ఐద్వా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌బీ, నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు. పొదుపు మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కేవలం బ్యాంక్‌ లింకేజీ రుణాలు మాత్రమే ఇప్పించి గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. ఆ రుణాలకు సైతం అధిక వడ్డీలు విధిస్తున్నారన్నారు. ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, రూ.10 లక్షల వరకు రుణమాఫీ, వడ్డీ మాఫీ, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ప్రకటించిందన్నారు. అయితే రెండు సంవత్సరాలు గడిచినా ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరమన్నారు. బ్యాంక్‌, మెప్మా అధికారుల వేధింపులు పొదుపు మహిళలపై అధికమయ్యాయన్నారు. అన్‌లైన్‌ యాప్‌ల నమోదు పేరుతో పొదుపు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నగరంలో 53, 54 డివిజన్‌లలో లక్షమందికి పైగా నివసిస్తున్నారని వాటి పరిధిలో ప్రభుత్వ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నెలరోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని పీడీకి తెలిపారు. ధర్నాలో ఐద్వా నెల్లూరు రూరల్‌ కార్యదర్శి షేక్‌ షాహినా బేగం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ డి.అన్నపూర్ణమ్మ, ఇంకా రెహనా బేగం, నగరాధ్యక్షురాలు ఎన్వీ సుబ్బమ్మ, ఆదిలక్ష్మి, సంపూర్ణమ్మ, మహమ్మదా, షాహిన్‌, మంజుల భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement