● విధులు బహిష్కరించి జీజీహెచ్ వద్ద ధర్నా
● రోగులకు అందే సేవలపై ప్రభావం
నెల్లూరు(అర్బన్): డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరడంతో సేవలపై ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టై ఫండ్ పెంచాల్సి ఉందన్నారు. రెండేళ్లు దాటి ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టై ఫండ్‌ను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65 లేదా 70 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కొత్తగా వైద్యులకు అవకాశాలు కల్పించాలంటే ప్రస్తుత ఉన్న నిబంధనను కొనసాగించాలని కోరారు. ఎంబీబీఎస్, పీజీ చేసిన వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వైద్య విద్య బోధన కొనసాగుతున్న నేపథ్యంలో నాన్ – మెడికల్ విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా కల్పించి వైద్య విద్య బోధించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు నిర్మల్, భార్గవ్, రవి, భావన, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


