● తిరుపతి ఎంపీ గురుమూర్తి
గూడూరురూరల్: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని కోటలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి మంగళవారం లేఖ రాశారు. గురుకుల ప్రాంగణాన్ని ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ ఎంతో కాలంగా సేవలందిస్తున్న గురుకులాన్ని ఒక్కసారిగా మూసివేయడంతో సుమారు 600 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం స్వాగతించదగిన విషయమేనన్నారు. అయితే అందుకోసం ఇప్పటికే కొనసాగుతున్న పాఠశాలను మూసివేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. గురుకులాన్ని యథావిధిగా కొనసాగిస్తూ అవసరమైతే అదే ప్రాంతంలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రబుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు.
దెబ్బతిన్న సైఫన్ పరిశీలన
● టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని
కలెక్టర్ ఆదేశం
సంగం: మండలంలోని మర్రిపాడు వద్ద కావలి కాలువకు సంబంధించిన దెబ్బతిన్న సైఫన్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం పరిశీలించారు. సైఫన్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రింగ్ బండ్‌ను చూసి ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తాత్కాలిక మరమ్మతులు చాల్లే’ కథనానికి కలెక్టర్ స్పందించారు. శాశ్వత నిర్మాణం చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సాగునీటి మ్యాప్‌ను పరిశీలించి, కాలువ ద్వారా రైతులకు నీరు అందుతున్న తీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణం చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి సైఫన్ దెబ్బతినడంతో ఎదురవుతున్న సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, పంటల పరిస్థితిపై వివరాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ దేశనాయక్, మధుబాబు నాయుడు, శ్రీనివాసులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, బాబు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
నిద్రమత్తు.. నిండు ప్రాణం బలి
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని ఆర్‌ఆర్ నగర్ సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నంద్యాల నుంచి నెల్లూరుకు కారులో ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. వాహనం ఆర్‌ఆర్ నగర్ వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపుతప్పిన కారు పలుమార్లు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న షేక్ జావీద్ (26) అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


