రెంట్‌ కారు కోసం పోలీసుల వేట | - | Sakshi
Sakshi News home page

రెంట్‌ కారు కోసం పోలీసుల వేట

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

సంగం: అద్దెకు తీసుకున్న కారును యజమానికి అప్పగించకుండా పరారైన వ్యక్తుల కోసం కడప నుంచి సంగం వరకు ఛేజింగ్‌ సాగింది. పోలీసుల వేటను పసిగట్టిన నిందితులు కారును పొలాల్లో వదిలేసి పరారయ్యారు. సంగం ఎస్సై భోజ్యానాయక్‌ కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సాయిచంద్‌ వద్దకు ఈనెల 8న హమీద్‌ అనే యువకుడి వెళ్లి లాంగ్‌ డ్రైవ్‌ కోసం తన డాక్యుమెంట్లు సమర్పించి కారును అద్దెకు తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం 9న వాహనాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంది. అయితే హమీద్‌ తిరిగి రాకపోవడంతో సాయిచంద్‌ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అతను మీర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు.

జీపీఎస్‌ ఆధారంగా..

పోలీసులు కారు జీపీఎస్‌ లొకేషన్‌ను పరిశీలించి వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సాయిచంద్‌ మంగళవారం కడపకు చేరుకోగా ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు నిందితులు కారుతో వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో సాయిచంద్‌ తన కారులో నిందితుడి వాహనాన్ని వెంబడిస్తూ కడప నుంచి ఆత్మకూరు వైపు వచ్చాడు. ఈ క్రమంలో డీసీపల్లి టోల్‌గేట్‌లో నిలపకుండా సంగం వైపు వచ్చారు.

112కు సమాచారం

పరిస్థితిని గమనించిన సాయిచంద్‌ వెంటనే 112కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సంగం ఎస్సై భోజ్యానాయక్‌ సిబ్బందితో అప్రమత్తమై నిందితుల వాహనం కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల వాహనాలను గమనించిన వారు బుచ్చి టోల్‌గేట్‌ వైపు వెళ్లి అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకున్నారు. అనంతరం దువ్వూరు గ్రామం వైపు దూసుకెళ్లారు. పోలీసులు వెంబడిస్తుండటంతో చివరకు చీకట్లో కారును పొలాల్లో వదిలేసి పరారయ్యారు. సంగం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని రికవరీ చేసి యజమాని సాయిచంద్‌కు అప్పగించారు. ఘటనపై మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు.

కడప నుంచి సంగం వరకు

సినిమా స్టైల్‌ ఛేజింగ్‌

పొలాల్లో వదిలేసి పరారైన కేడీలు

సంగం ఎస్సై చాకచక్యంతో

వాహనం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement