ప్రమాదంలో దగ్ధమవుతున్న స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్–1. (ఇన్‌సెట్‌లో) ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి మృతి చెందిన కార్మికుడు
8 మంది సజీవ దహనం
లాడెల్ నుంచి పైకి ఎగసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు
ఉక్కు ద్రవం పడటంతో కాలిపోయి ముద్దల్లా మారిన మృతదేహాలు
ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
ఒక్కసారిగా నేలపై ఒలికిన 150 టన్నుల ద్రవపు ఉక్కు
సుమారు 1,600 డిగ్రీల ఉక్కు ద్రవం వేడికి భారీ క్రేన్ దగ్ధం
టీ విరామం కావడంతో బయటకు వెళ్లిన పలువురు ఉద్యోగులు, కార్మికులు
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం / ఉక్కునగరం: బతుకుదెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కుద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ఎనిమిది మందిని సజీవ దహనం చేసింది. నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
లాడెల్ నుంచి విరజిమ్మిన ద్రవపు ఉక్కు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్‌ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.
స్టీల్ ప్లాంట్ల చరిత్రలో తొలిసారిగా..!
దేశంలోని ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీకయి ప్రమాదాలు జరిగేవి. కానీ.. ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్‌మెటల్‌ను లాడెల్‌లో ఎస్‌ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బీ షిఫ్ట్‌లో సీసీడీ మిషన్–2 పై లాడెల్‌ను సిద్ధం చేశారు. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్–1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సీసీడీ సెక్షన్‌లో లాడెల్‌ను రొటేట్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది.
సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానలంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకు పోయారు. తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తూ మంటల్లో నుంచి ఇద్దరు కార్మికులు అతి కష్టమ్మీద బయటకు వచ్చారు.
అతి కష్టమ్మీద అదుపులోకి..
ఎక్కడ చూసినా సలసల కాగుతున్న ద్రవపు ఉక్కుతో ఎస్‌ఎంఎస్–1లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ ఫైర్ విభాగం మంటలను అతికష్టమ్మీద అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయిన వారిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్ప కోసం నగరంలోని పలు హాస్పిటల్స్‌కు తరలించారు.
స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచిన మృతదేహాలను కేజిహెచ్‌కు తరలించకుండా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వెల్లడించాలని, దుర్ఘటనపై యాజమాన్యం వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో మృతదేహాలను జనరల్ హాస్పిటల్ వద్దే ఉంచారు. క్షతగాత్రులను సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించిన అధికారులు ఎమర్జెన్సీ గేట్ నుంచి కాకుండా వెనక వైపు నుంచి తీసుకెళ్లారు. ఫోటోలు, వీడియోలు తీయవద్దని కలెక్టర్ చెప్పారంటూ మీడియా ప్రతినిధులను ఆర్డీవో హెచ్చరించారు.
రెండు నెలలుగా 27 సార్లు లీక్..!
గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రాణ నష్టాన్ని తగ్గించిన టీ విరామం..
సాయంత్రం సమయంలో టీ విరామం కోసం చాలా మంది కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సాధారణంగా 60 నుంచి 70 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. కానీ ఆ సమయంలో టీ విరామానికి వెళ్లిపోవడంతో 15 నుంచి 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తగ్గిందని చెబుతున్నారు.
విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు.

ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగులు..
⇒ గోల్డ్ కుమార్, మెకానిక్ ఇన్‌చార్జ్–2
⇒ గొందిన భానుకుమార్, టెక్నీíÙయన్
⇒ ఎం.కృష్ణ నాగ్, టెక్నీíÙయన్
⇒ కె. ప్రభాకర్, టెక్నీíÙయన్
⇒ జీవీ అప్పారావు
కాంట్రాక్ట్ కార్మికులు..
⇒ నక్క వెంకటరమణ
⇒ త్రినాథ్
⇒ ఎన్.అప్పలరాజు
తీవ్రంగా గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులు...
⇒ సూరిబాబు(90 శాతం కాలిన గాయాలు), పైడిరాజు(30 శాతం కాలిన గాయాలు), పల్లెల శ్రీనివాసరావు (40 శాతం కాలిన గాయాలు)లను సెవెన్ హిల్స్‌కు తరలించారు.
⇒ రావూరి మల్లికార్జునరావు , జి.అర్జున్ అప్పారావు, సత్యానంద్ బాలువ (10 శాతం కాలిన గాయాలు)లను కిమ్స్‌లో చేర్పించారు.
మృతుల కుటుంబాలవైపు కన్నెత్తి చూడని హోంమంత్రి
పర్యటన ప్లాంట్‌కే పరిమితం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదం గురించి తెలుసుకున్న హోం మంత్రి అనిత సోమవారం రాత్రి ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి ఎలా జరిగిందనే వివరాల్ని అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు. కానీ సమీపంలో ఉన్న ఉక్కు జనరల్ హాస్పిటల్ వైపు వెళ్లలేదు. అక్కడ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ఓదార్చేందుకు హోంమంత్రి గానీ, ఎంపీ భరత్ గానీ రాకపోవడంపై కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం అత్యంత విషాదకరం: మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్–2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
బాధాకరం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మృతుల ఆత్మలకు శాంతి కలగాలి. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
తీవ్ర ఆవేదన చెందుతున్నా
స్టీల్ ప్లాంట్ ప్రమాదం కలచివేసింది. పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి
అత్యంత దిగ్భ్రాంతికరం
విశాఖ స్టీల్‌ప్లాంట్ దుర్ఘటన అత్యంత దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేíÙయాను ప్రకటించాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మాటలు రావడం లేదు
వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలిపేందుకు మాటలు రావడం లేదు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.
– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
అత్యంత బాధాకరం
దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
విషాదకరం
స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
– డాక్టర్ తనూజరాణి, అరకు ఎంపీ
ప్రభుత్వం ఆదుకోవాలి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. – కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్
దురదృష్టకరం
స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం. విషాద ఘటన గురించి తెలియగానే ప్లాంట్‌కు చేరుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు

స్టీల్ ప్లాంట్‌లో విషాద ఘటనలివీ..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటివరకూ జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. 2012 జూన్‌లో జరిగిన దుర్ఘటన ప్లాంట్ చరిత్రలో అత్యంత విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్లాంట్‌లో విషాద ఘటనల వివరాలివీ...
⇒ 2012 మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్–3 లో పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
⇒ 2012 జూన్ 13న విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. స్టీల్ మెల్టింగ్ షాప్–2 వద్ద ఆక్సిజన్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అధిక పీడనం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
⇒ 2014 జూన్ 16న ఎస్‌ఎంఎస్–2 విస్తరణ పనుల్లో భాగంగా కంటైనర్ ల్యాబ్‌ని తనిఖీ చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ లీకై ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టు ఇంజనీర్లు మృతి చెందారు.
⇒ 2020 డిసెంబర్ 18న స్టీల్ మెల్టింగ్ షాప్–2(ఎస్‌ఎంఎస్–2)లో వేడి ద్రవపు ఉక్కుని తీసుకెళ్తున్న ల్యాడిల్ హుక్స్ ఊడిపోవడంతో ద్రవం కింద పడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది.
⇒ 2021 నవంబర్ 16న బ్లాస్ట్ ఫర్నేస్–3లో పేరుకుపోయిన స్లాగ్(వ్యర్థం) తొలగిస్తుండగా వేడి ద్రవరూప లోహం ఒక్కసారిగా ఎర్త్ మూవర్ పైకి దూసుకొచి్చంది. ఈ ప్రమాదంలో ఆపరేటర్, సూపర్‌వైజర్, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
⇒ 2026 మే 11న ప్లాంట్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియాలో స్వల్ప స్థాయిలో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ (కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు) లీకై నలుగురు కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
⇒ 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో దాదాపు ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని యూనియన్ నాయకులు చెబుతున్నారు.
ప్రమాదాలతో ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టాలు
స్టీల్ ప్లాంట్‌లో ద్రవపు ఉక్కు ప్రమాదాలే అత్యధికంగా జరుగుతున్నాయి. మెల్టింగ్ షాపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆధునికీకరించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్– జూన్ మధ్య వరుసగా జరిగిన ప్రమాదాలు స్టీల్ ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టం కలిగించాయి.
⇒ 2011 ఏప్రిల్ 10న ఎస్‌ఎంఎస్‌లో ల్యాడిల్ నుంచి సుమారు 140 టన్నుల ద్రవపు ఉక్కు కిందపడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ప్లాంట్‌కు రూ.60 కోట్ల నష్టం
వాటిల్లింది.
⇒ 2011 ఏప్రిల్ 14న ఎస్‌ఎంఎస్ కంటిన్యుయస్ కాస్టింగ్ విభాగంలో 140 టన్నుల హాట్‌మెటల్ లీకేజీ కావడంతో రూ.60 కోట్లు నష్టం సంభవించింది. రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.
⇒ 2011 ఏప్రిల్ 17న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మూడు కన్వేయర్ బెల్ట్‌లు తెగిపోయి 48 గంటల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.
⇒ 2012 ఫిబ్రవరి 6న ఎస్‌ఎంఎస్‌లో భారీ స్థాయిలో హాట్‌మెటల్ స్పిల్లేజ్ కారణంగా రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది.
⇒ 2012 మే 22న కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడిసరుకు తీసుకెళ్తున్న కన్వేయర్ బెల్ట్ సింటర్ ప్లాంట్ వద్ద పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.కోటి నష్టం వాటిల్లింది.


