‘కూతురు కొడుకు ఎన్టీఆర్‌కు వారసుడా?’ | Lakshmi Parvathi Serious Comments On Nara Lokesh, Watch Video Inside | Sakshi
Sakshi News home page

‘కూతురు కొడుకు ఎన్టీఆర్‌కు వారసుడా?’

May 30 2025 9:25 AM | Updated on May 30 2025 10:47 AM

Lakshmi Parvathi Serious Comments On Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్‌ వారసులు అవుతారు తప్ప.. నారా లోకేష్‌ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్‌ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ..‘మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌కు కూతురు కొడుకైన నారా లోకేష్.. ఏ విధంగా ఎన్టీఆర్‌కు వారసుడు అవుతాడు?. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్‌ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్‌ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్‌ వారసుడు అని చెప్పుకొచ్చారు.  

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్‌ రచించిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్‌ బుక్‌ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్‌ కంపెనీ రాకుండా తరిమేశారు’ అని విమర్శలు చేశారు.

కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రష్టుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి  అంటున్నారు. 

పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు. అవినీతి సొమ్మును వైట్‌ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన  సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’ అని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement