సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24 వరకూ ఎస్‌ఐఆర్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జులై31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అనంతరం అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కాగా ముందుగా నిర్ణయించిన విధంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఈ రోజు (మంగళవారం)తో ముగియాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. ఒకవైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు రాజకీయ జోక్యం. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.
దీంతో అనేక ప్రాంతాల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కావడం, తప్పులను సరిదిద్దడం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. చివరి దశకు వచ్చినా ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాకపోవడం ఓటర్లు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.


