విశాఖపట్నం: కనుమ పండగ నాటుకోడికి గిరాకీ తెచ్చింది. సాధారణ రోజుల్లో బ్రాయిలర్ కోడి మాంసం తిని విసిగిపోయిన జనం.. శుక్రవారం కనుమ రోజున నాటు కోళ్ల సంతకు పరుగులు తీశారు. దీంతో అక్కడ కోళ్లకు గిరాకీ పెరిగింది. జాతీయరహదారి పక్కన డెయిరీఫారం వద్ద నిత్యం నాటుకోళ్ల బజారు జరుగుతుంది. ఇక్కడకు తగరపువలస, ఆనందపురం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతాల నుంచి నాటుకోళ్లను వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు.
కొన్నేళ్లగా సంక్రాంతి సందర్భంగా కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో నాటు కోడి కిలో రూ.600 ఉండే ధర ఇప్పుడు రూ.800కు పెరిగిపోయింది. ఇది కేవలం లైవ్ ధర. డ్రస్డ్ నాటుకోడి మాంసమైతే మటన్ ధర కంటే ఎక్కువేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా కొనుగోలుదార్లు వెనక్కి తగ్గకుండా నాటుకోడివైపే మొగ్గు చూపారు. ఇక్కడ కనుమ రోజున 700కు పైగా కోళ్ల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు తెలిపారు. బ్రాయిలర్ కోడి మాంసం కూడా కిలో రూ.300 దాటడం కూడా నాటుకోళ్ల గిరాకీకి కారణమని చెప్తున్నారు.


