అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు | The Grand Brahmotsavam of Goddess Padmavathi at Tiruchanur | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Nov 17 2025 5:44 PM | Updated on Nov 17 2025 5:55 PM

The Grand Brahmotsavam of Goddess Padmavathi at Tiruchanur

సాక్షి,తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరింద్రనాథ్,  కంకణ భట్టార్   పి. శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ  శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.

శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement