ముక్కంటి.. కనవేంటి?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఇంజినీరింగ్ అధికారులు తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. భక్తుల భద్రతను గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన క్యూలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాధారణంగా దేవాలయాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో, అవసరమైతే బయటకు వెళ్లేలా ఎమర్జెన్సీ గేట్లతో క్యూలు ఏర్పాటు చేస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం ఐదు అడుగుల ఎత్తు, అదీ స్క్వేర్ స్టీల్ పైపులతో క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా ఎమర్జెన్సీ గేట్లు కూడా లేవు. మహాశివరాత్రి లాంటి రద్దీ రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. గత మంగళవారం ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ క్యూలను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్యూలైన్ల ఎత్తు తగ్గించాలని ఆదేశించినట్లు తెలిసింది.
పనులు విడగొట్టి..లాభాలు పంచిపెట్టి!
ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్లకు లాభాలు పెంచేందుకు పనులను చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి, కమిషనర్ స్థాయికి వెళ్లకుండా తమ పరిధిలోనే టెండర్లు పిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంగణంలో ఉన్న పనులకు షెడ్‌కు ఒక టెండర్, కౌంటర్లకు మరోటి, క్యూలకు ఇంకొకటి, మొబైల్ కౌంటర్లు, చెప్పుల స్టాండ్లకు విడివిడిగా టెండర్లు పిలిచి కొంతమందికి కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.


