జల్లికట్టులో జగన్ మేనియా!
చంద్రగిరి: సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో పల్లెటూళ్లు పరుష పందేల(జల్లికట్టు)తో కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని కొత్తశానంబట్లలో నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం పరుష పందేలు నిర్వహించారు. పందేలను తిలకించడానికి జిల్లాతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పశువులకు నల్లధారం నడుముకు కట్టి, బుడగలు, పుష్పాలతో వాటిని అందంగా అలంకరించి, కొమ్ములకు పలకలను కట్టి బరిలోకి దింపి, పరుగులెత్తించారు. జోరుగా దూసుకువచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. కోడెగిత్తలకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పలువురు పోటాపోటీగా ఎగపడ్డారు. జల్లికట్టులో గెలుపొందిన వారు పలకలను చేతపట్టుకుని విజయ గర్వంతో ఊగిపోయారు. జల్లికట్టు సందర్భంగా శానంబట్ల గ్రామం జనసంద్రంగా మారింది.
కోడెగిత్తల కట్టడిపై పందేలు
పశువుల యజమానులు తమ కోడెగిత్తలను అదు పు చేయడంపై పెద్ద ఎత్తున పందేలు కాశారు. తన ఎద్దును అదుపు చేసిన వారికి ఏకంగా ఒక ఎకరా పొలం రాసిస్తానంటూ ఓ వ్యక్తి పందెం కాయగా, మరో వ్యక్తి తన ఎద్దున పట్టుకున్న వారికి రెండు పొట్టేళ్లు, రూ.10 వేల నగదు ఇస్తామనడం హాట్ టాపిక్‌గా మారింది. మరి కొందరైతే పట్టు వస్త్రాలు, నగదు, వెండి దేవతా విగ్రహాలను సైతం ఎద్దులకు కట్టి రంగంలోకి దింపారు.
వైఎస్సార్‌సీపీ జెండాల రెపరెపలు
అధికారం లేకున్నా వైఎస్సార్ సీపీపై ప్రజలకు ఉన్న ప్రేమను మాత్రం గెలవలేకపోయారు. కొత్తశానంబట్లలో నిర్వహించిన పశువుల పండుగలో అడుగడుగునా ప్రజలు వైఎస్సార్‌సీపీపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఎద్దుల కొమ్ములకు కట్టే పలకలో తన అభిమాన నాయకులు ఫొటోలను కట్టి బరిలోకి దింపారు. తమ ఎద్దును నిలువరించే వారికి భారీ నగదు బహుమతి అందజేస్తామంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు విసిరిన సవాలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎద్దులు దూసుకెళుతూ సవారీ చేశాయి.
పలువురికి గాయాలు
కోడెగిత్తలను అదుపుచేసే సమయంలో పలువురు యువకులు గాయాలపాలైయారు. పచ్చికాపల్లం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎద్దు పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దిరిని ఎద్దు ఢీకొంది. మరో వ్యక్తికి ఎద్దును అదుపు చేసే క్రమంలో కాలు విరిగింది. సందర్శకులకు గ్రామస్తులు అన్నదానం చేయడంతోపాటు శీతల పానీయాలను ఉచితంగా అందజేశారు.
జల్లికట్టులో జగన్ మేనియా!
జల్లికట్టులో జగన్ మేనియా!


