కలెక్టరేట్.. పాలన సఫరేట్
తిరుపతి అర్బన్: జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టును భర్తీ చేయకుండా చంద్రబాబు సర్కార్ కాలయాపన చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ జాయింట్ కలెక్టర్ లేరు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు ఇన్‌చార్జి జేసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు, తుడా ఈసీగా, స్మార్ట్ సిటీ ఎండీగా బాధ్యతలను చక్కపెట్టడానికి సమయం సరిపోతుంది. రాష్ట్రంలో పెద్ద జిల్లాలో తిరుపతి జిల్లా ముందు వరుసలో ఉంది. 36 మండలాల పరిధిలోని 30 లక్షల జనాభా ఉన్న తిరుపతికి, అదనంగా తిరుమల ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ డ్యూటీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టలేకపోతున్నారన్న విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతికి రెగ్యులర్ జేసీని నియమించడానికి 100 రోజులుగా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రెవెన్యూ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల్లో 55 శాతం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలను అధికారులు అందుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులు, మరో 4 లక్షల మంది వివిధ రకాల ప్లాట్లు ఉన్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వివిధ రెవెన్యూ సమస్యలున్నాయి. వాటికి పరిష్కారం లభించకపోవడంతో నానా తిప్పులు పడుతున్నారు. మరోవైపు కొత్త పాస్ పుస్తకాల అంశంలోనూ అనేక ఇబ్బందులు చోటుచేసుకున్నాయి. చాలమందికి పాసు పుస్తకాలు తొలి దశలో రాలేదు. ఇంకోవైపు భూ సర్వేకు సంబంధించి పలు సమస్యలున్నాయి. వాటిని గాడిలో పెట్టాల్సి ఉంది. మరోవైపు పలు జిల్లాలో గత సోమవారం నుంచి రెవెన్యూ క్లినిక్ శిబిరాల పేరుతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో సాగడం లేదు. జిల్లాలో కీలమైన అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో సమస్యలు పెరుకుపోతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనికి తోడు మండలాలు, డివిజన్ పరిధిలోను రెవెన్యూ ఉద్యోగుల కొరత ఉంది. అయినా రాష్ట్ర పెద్దలు అవసరం మేరకు అధికారులను నియమించి, జిల్లాలో పాలనను గాడిన పెట్టకుండా గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
శిక్షణ నిమిత్తం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల 4 నుంచి 30వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో 25 రోజుల పాటు కొత్త కలెక్టర్‌ను ఏర్పాటు చేస్తారా? లేదా ఇన్‌చార్జి జేసీగా ఉన్న నారపురెడ్డి మౌర్యకే కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తారా? అనే అంశంపై జిల్లాలో చర్చ సాగుతోంది. మొత్తంగా కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవసరమైన మేరకు రెవెన్యూ ఉన్నతాధికారుల పోస్టు భర్తీ చేయకపోవడంతో సామాన్య, పేద ప్రజలకు తిప్పలు లేదు.
ఇదీ జిల్లాలో పాలన పరిస్థితి. తిరుపతి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో పలు పోస్టులు ఇన్‌చార్జిల పాలనలోనే సాగుతున్నాయి. అందులోనూ ఒకే వ్యక్తి పలు పో స్టులకు ఇన్‌చార్జిగా కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యనే వ్యవహరిస్తుండడంతో ఆమె నాలుగు పాత్రలు పోషించాల్సి వస్తోంది. పని ఒత్తిడి కారణంగా ఆమె అన్ని శాఖ లపై పట్టు సాధించలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోనే ప్రముఖ స్థా నం ఉన్న తిరుపతి జిల్లా స్థితి ఇలా ఉంటే ఎలా సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు మండిపడుతున్నారు.
కలెక్టరేట్.. పాలన సఫరేట్


