సాక్షి, తిరుపతి: టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.

టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారు. అయితే ఆ సమయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మద్యం మత్తులో ఉన్న ఆలయంలోకి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది చూసే లోపే గోడ దూకి లోపలికి చొరబడ్డాడు. నేరుగా మహాద్వారం లోపల ఆలయ గోపురం ఎక్కాడు. అక్కడ నిల్చుని.. 90 ఎంఎల్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగనంటూ హల్ చల్ చేశాడు.



అది గమనించిన విజిలెన్స్ సిబ్బంది కిందకు రావాలంటూ బతిమాలారు. చేతిలో రాడ్‌తో ఆలయ కలశాలను ధ్వంసం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఫైర్ సిబ్బందిని రప్పించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. ఈ చర్యకు పోలీసులు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో.. అర్ధరాత్రి కవరేజ్‌కు వచ్చిన మీడియాపై ఫైర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.


సదరు వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మ వాడ పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి అలా చేశాడని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ప్రస్తుతం అతన్ని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆలయ కలశాలు పాక్షిక్షంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
టీటీడీ స్పందన
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో ఆలయం గోపురంపై హాల్ చల్ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ‘‘నిన్న రాత్రి నిజామాబాద్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి.. ఇతర భక్తులలాగే ఆలయంలోకి ప్రవేశించాడు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కాడు. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది అతనిని గుర్తించి పోలీసు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అని టీటీడీ సీపీఆర్వో తెలిపారు.


