వివాహితను నవవధువుగా చెప్పి మోసం | Fraud Marriage Brokers In Vijayawada | Sakshi
Sakshi News home page

వివాహితను నవవధువుగా చెప్పి మోసం

Jun 17 2025 1:57 PM | Updated on Jun 17 2025 3:34 PM

Fraud Marriage Brokers In Vijayawada

వరుడి నుంచి రూ.2.88 లక్షలు 

కాజేసిన మధ్యవర్తులు   

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): వివాహమై పిల్లవాడు ఉన్న యువతిని పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి లక్షలు దండుకొని మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక కొప్పుల్‌ జిల్లాకు చెందిన జి.దుర్గాప్రసాద్‌ (34) వివాహం కాకపోవడంతో స్థానికంగా ఉన్న మ్యారేజీ బ్యూరోకి చెందిన శ్రీదేవి అనే మహిళ ద్వారా రాజమండ్రి, విజయవాడలోని మధ్యవర్తులను ఆశ్రయించాడు. వారు విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేశారు. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్‌ అప్పారావు కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్‌ ఆమని అనే  యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడ కృష్ణలంకలోని ఒక హోటల్‌లో పెళ్లి చూపులు తతంగం జరిపించారు.

 అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే రూ.2.70 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం మరో రూ.18 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు పార్వతి అనే మహిళకు రూ.50 వేలు ఇచ్చారు. ఈ నెల ఐదున దుర్గగుడిలో వివాహం జరిగింది. కర్నాటక వెళ్లి ఏడో తేదీన వరుడి ఇంటి వద్ద రిసెప్షన్‌ జరుపుకొన్నారు. పల్లవి వెంట కర్నాటక వెళ్లిన ఆమె సోదరుడు హరీష్‌ రిసెప్షన్‌ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద రూ.50 వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు. 

మూడు రోజుల తరువాత పల్లవి తనకు అంతకు ముందే వివాహమైందని, ఒక బాబు కూడా  ఉన్నట్లుగా చెప్పింది. దాంతో దుర్గాప్రసాద్‌ తాను మోసపోయినట్లు గుర్తించి తన కుటుంబ సభ్యులకు వివరించాడు. పల్లవిని తీసుకొని ఈ నెల 14వ తేదీన విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి  కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.  తనను మోసం చేయటమే కాకుండా తన నుంచి రూ.2.88 లక్షల నగదును  సైతం కాజేశారని వాపోయాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు దుర్గాప్రసాద్‌ను వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు పంపించారు. దుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement