యూటీఎఫ్ పోరాట వీరుల
విజయోత్సవ సభలో వక్తలు
కృష్ణలంక (విజయవాడతూర్పు): దశాబ్దాలుగా విరామం ఎరుగని పోరాటాల వల్లే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధన సాధ్యమైందని, అదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ పాత పెన్షన్ సాధనకు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల రక్షణకు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఓపీఎస్ పోరాట వీరుల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పీడీఎఫ్ మాజీ ఫ్లోర్‌లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కె.జోజయ్య మాట్లాడుతూ.. ‘ఈ విజయంతో పొంగిపోకుండా సీపీఎస్ అంతం మన పంతం అనే నినాదంతో ఉద్యమం కొనసాగించాలి. పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు. సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పులను అమలు చేయాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలు, నిరాహారదీక్షలు చేపట్టి కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలను కండువా, బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఉద్యమ ఘట్టాలు అనే పుస్తకాన్ని బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్మోలజు, శ్రీనివాసరావు, ఎ.ఎన్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.


