మల్లేశ్వర స్వామికి ఘటాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నెలకొని ఉన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, లోక కల్యాణార్థం ఇంద్రకీలాద్రిపై గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణ జపాలు, వరుణ యాగాలు ఆదివారంతో పరిపూర్ణమయ్యాయి. ఆదివారం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో జపాలు, స్వామి వారికి ఘటాభిషేకాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతితో వరుణ యాగాలు పరిసమాప్తమయ్యాయి. తొలుత ఉదయం దుర్గాఘాట్ వద్ద ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పవిత్ర కృష్ణాజలాలను ఘటాలతో తీసుకుని మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.
ఘటాభిషేకం ఇలా..
కృష్ణానది నుంచి ఘటాలతో పవిత్ర కృష్ణాజలాలను మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న అనంతరం శాంతి కల్యాణ వేదిక వద్ద ఆలయ వైదిక కమిటీ, వేద పండితులు, ఆలయ అర్చకులు, వేద విద్యార్థులు వేద పారాయణ చేశారు. మల్లేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంలో స్వామి వారికి పవిత్ర కృష్ణాజలాలతో అభిషేకాలను నిర్వహించారు. స్వామి వారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. యాగశాలలో శత అనువాహక, కారక పారాయణలు, మండప దేవతా హోమాలను నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.


