సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు, రైల్వేకాలనీ రోడ్డు పక్కన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో పొదల్లో ఆడ శిశువును గుర్తించిన స్థానికుడు ఆస్పత్రిలో చేర్చాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి శిశువును వదిలి వెళ్లిన వారి కోసం గాలింపు చేపట్టారు. విజయవాడ సూర్యారావుపేటకు చెందిన కటికల విజయ్ శనివారం రాత్రి 10.30గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డులో ఫుడ్ కోర్టుకు వెళ్లి భోజనం చేశాడు. అనంతరం టాయిలెట్‌కు వెళ్లేందుకు రైల్వే క్వార్టర్స్ సిమెంట్ రోడ్డు వద్దకు వెళ్లగా అక్కడ పొదల్లో నుంచి ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు, మూడు రోజుల వయస్సు కలిగిన ఆడ శిశువు ఏడుస్తూ కనిపించింది. వెంటనే శిశువును తీసుకుని బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో చేర్పించారు. శిశువుకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. విజయ్ ఫిర్యా దు మేరకు ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి శిశువును వదిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఏపీజీఈఏ ఆవిర్భావ వేడుకలు
పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 16వ ఆవిర్భావ వేడుకలు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర, జిల్లా, నగర శాఖల ప్రతినిధులు, మహిళా విభాగం నేతలు, ఉద్యోగులు, సభ్యుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఏపీజీఈఏ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఏపీజీఈఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగసాయి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పి.లీలావతి, అసోసియేషన్ కార్యదర్శి కూనపురెడ్డి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


