ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన డీజీపీకి ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, హరీష్‌కుమార్‌గుప్తా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈఏపీ సెట్–2026 బైపీసీ స్ట్రీమ్‌లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్ సోమ, మంగళవారాల్లో జరగనుంది. సాధారణ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైన ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గౌడ్స్, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌కు స్వయంగా వచ్చి సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరీశీలన పూర్తి అయిన విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్‌ఆప్షన్లకు ఈ నెల 24వ తేదీన మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఆన్‌లైన్‌లో సీట్ ఎలాట్‌మెంట్‌ను ప్రకటిస్తారన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ కృష్ణాజిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ ఎన్నికలను ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎంవీ శ్యామ్‌నాథ్ పర్యవేక్షణలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జి. గోపీచంద్, ప్రధాన కార్యదర్శిగా పి. జితేంద్ర, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం. కల్పనమయూరి, ఉపాధ్యక్షుడిగా కె. సాయిబాబు, వర్కింగ్ ప్రెసిండెంట్‌గా పి. శ్రావణ్‌కుమార్, ట్రెజరర్‌గా బి. దిలీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె. కిరణ్, జాయింట్ సెక్రటరీలుగా ఎ. రమ్య, కె. పూర్ణచంద్రరావు, కార్యవర్గ సభ్యులుగా సురేఖ, సీహెచ్ స్వామి, ఎన్. సాయితేజ ఎన్నికయ్యారు.
నేటి నుంచి అత్యవసర సేవలు బంద్
జూడాల ఉద్యమం ఉద్ధృతం
పటమట(విజయవాడతూర్పు): జూనియర్ వైద్యుల ఉద్యమం సోమవారం నుంచి తీవ్ర రూపం దాల్చనుంది. అందులో భాగంగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించి నిరసన తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యుల సంఘం పిలుపు మేరకు వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. సాధారణ సేవలను మాత్రమే బహిష్కరించి, అత్యవసర సేవలైన క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్లకు హాజరవుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నారు.
స్టైపండ్ పెంచాల్సిందే..
తమ డిమాండ్లలో ముఖ్యమైన అంశం స్టైపండ్ పెంచాల్సిందేనని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లకోసారి 15శాతం పెంచాల్సి ఉండగా, 8 నెలలుగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూడాలు చెబుతున్నారు. తమిళనాడు తరహాలో ఏడాదికి మూడు శాతం పెంపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వాళ్లు తేల్చి చెబుతున్నారు. రోగులను ఇబ్బంది పెట్టాలనీది తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం కారణంగానే అత్యవసర సేవలను బహిష్కరించాల్సి వచ్చిందని జూడాలు పేర్కొంటున్నారు.


