డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం | Better treatment for diarrhea sufferers | Sakshi
Sakshi News home page

డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం

Feb 12 2024 4:38 AM | Updated on Feb 12 2024 4:25 PM

Better treatment for diarrhea sufferers - Sakshi

నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 8341396104కు ఫోన్‌ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఆదివారం మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు.

2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచ­నాలతో జీజీహెచ్‌కు వచ్చా­ర­న్నారు.

వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్‌ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్‌ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్‌ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. 
డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్‌ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు.

శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్‌ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement