గిరిపురంలో 20 మంది వరకు అతిసారవ్యాధి బాధితులు
పది రోజులుగా మొత్తుకుంటున్నా మేలుకోని సర్కారు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంపై డయేరియా పంజా విసిరింది. రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. పది రోజులుగా కుళాయిల నుంచి కలుషిత, రంగుమారిన నీరు వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
గురువారం రాత్రి ఒకేసారి ఏకంగా ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించడంతో అధికారులు హడావుడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి విరోచనాలు కావడంతో తొలుత యూపీహెచ్‌సీలో చికిత్స అందించి అనంతరం పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియాకు గురైన సుబ్బలక్ష్మికి డీహైడ్రేషన్‌తో అనూహ్యంగా క్రియాటినిన్ పెరగడంతో కిడ్నీ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి తలెత్తింది.
పచ్చ రంగులో నీళ్లు: స్థానికులు అత్యధికంగా నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీటినే తాగుతుంటారు. వారం రోజులుగా కుళాయిల నుంచి రంగు మారి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో డ్రైయిన్లు అపరిశుభ్రంగా మారినా వీఎంసీ అధికారుల్లో చలనం లేదు. దీంతో ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతూ వచ్చారు. కలుషిత నీరే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఎవరూ పట్టించుకోలేదు..
మంచినీటి పైపుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. వాటిని తాగడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందా. ఇంకా నీరసం తగ్గలేదు. రంగునీళ్లు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – నన్నిపోగు మణి, బొడ్డు సుందరం వీధి, గిరిపురం
కిడ్నీలపై ఎఫెక్ట్..
వారం రోజుల కిందట ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం అయ్యాయి. ఒక్కసారిగా నీరసించి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షిస్తే క్రియాటినిన్ 15.9కి చేరింది. కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యేవని చెప్పారు. వీఎంసీ సరఫరా చేసే నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – జి.సుబ్బలక్ష్మి, గిరిపురం
జీజీహెచ్‌లో చేరా..
నాకు వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయా. ప్రభుత్వాస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి అయ్యా. వీఎంసీ సరఫరా చేసే రంగు మారిన నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – పి.ఉదయ్‌కుమార్, గిరిపురం


