సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అభ్యర్థుల భద్రత, నామినేషన్ కేంద్రాలు మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు భద్రతా ఏర్పాట్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోటీ చేసే అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించే అంశంపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బుధవారం ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కల్పించడంతోపాటు నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సీసీటీవీ కెమెరాల నిఘా, లైవ్ వెబ్కాస్టింగ్ అందుబాటులో ఉంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల భద్రతకు సంబంధించి వివరాలు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
నామినేషన్ల దాఖలు తేదీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగడం, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత వంటి అంశాలపై తీసుకునే చర్యలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు


