సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో సమీప గ్రామాలను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకపక్షంగా విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో విలీన ప్రక్రియపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే (అలోక్ రాథే)లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. గ్రామాల తీర్మానాలు, ఆమోదం తీసుకోకుండానే సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా.. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తుది తీర్పు వెలువడే వరకు విలీన ప్రక్రియ ఆ తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రాంతాల్లో విలీనంపై అభ్యంతరాలు
పొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజానగరం ప్రాంతాన్ని అప్గ్రేడ్ చేసే అంశం కూడా ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లలో ప్రస్తావనకు వచ్చింది. గ్రామాల విలీనానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియను పాటించారా? గ్రామాల అభిప్రాయాలు, తీర్మానాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారా? అన్న అంశాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.
ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్ వాయిదా


