మనోళ్లే.. ఇచ్చేయండి! | Another controversial decision by Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

మనోళ్లే.. ఇచ్చేయండి!

Jul 1 2026 5:19 AM | Updated on Jul 1 2026 5:19 AM

Another controversial decision by Chandrababu Naidu government

ప్రభుత్వం ఇచ్చిన భూములకు ప్రైవేటు సంస్థలు డబ్బులు చెల్లించకపోయినా రిజిస్ట్రేషన్‌ చేసేయాలంటూ జారీ చేసిన 395 జీవో

కేటాయించిన భూములకు డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లు చేయాల్సిందే

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కార్‌ బరితెగింపు 

భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు పొడుస్తూ జీవో ఎంఎస్‌ నంబర్‌ 395 జారీ  

డబ్బు చెల్లించకపోయినా ప్రైవేటు వారికి భూములు ఇచ్చేయాలని ఆదేశాలు 

వారం రోజుల్లోనే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయాలని స్పష్టీకరణ 

వారు అమ్మేసుకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికీ అనుమతి 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూములకు డబ్బులు చెల్లించక ముందే ప్రైవేటు డెవలపర్లకు కట్టబెట్టేలా జీవో ఎంఎస్‌ నంబర్‌ 395 జారీ చేసింది. ప్రభుత్వానికి రావలసిన భూమి విలువ పైసా కూడా చెల్లించకపోయినా సరే ప్రైవేట్‌ డెవలపర్లకు లీజులు, రిజిస్ట్రేషన్లు చేసేలా ఈ జీవోలో వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ భూముల కేటాయింపులకు ఉన్న కఠిన నిబంధనలను తాజా జీవోతో తుడిచి పెట్టేశారు.

ప్రభుత్వం పర్యాటక శాఖకు కేటాయించిన భూములకు సంబంధించి డబ్బులు చెల్లించక పోవడంతో ఆ భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ వీటికి లీజులు లేదా సేల్‌ డీడ్లు చేయడానికి నిరాకరించింది. అయితే ఖజానాకు డబ్బులు రాకపోయినా సరే ప్రైవేట్‌ డెవలపర్ల కోసం రిజిస్ట్రేషన్‌ చట్టం–1908 లోని సెక్షన్‌ 22ఎ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2024 జూలై ఒకటో తేదీ తర్వాత ఏపీ టూరిజం అథారిటీ లేదా  ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) లేదా ఏ ఇతర ప్రభుత్వ శాఖకైనా ఉచితంగానో, నామమాత్రపు ధరకో, బేసిక్‌ వాల్యూకో ఇచ్చిన భూములను నిధులు చెల్లించకుండానే ప్రైవేట్‌ డెవలపర్లకు లీజుకు ఇవ్వడానికి.. లేదా పూర్తిగా అమ్మేయడానికి ఈ జీవో ద్వారా అనుమతించారు. 

ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చిన ఏడు రోజుల్లోనే సీసీఎల్‌ఏ వెబ్‌ ల్యాండ్‌ పోర్టల్‌లో మార్పులు చేయాలని, రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌కు ఈ డేటా బదిలీ అయ్యేలా చూసి.. ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట లీజు, సేల్‌ డీడ్‌ లేదా బ్యాంకుల కోసం మారి్టగేజ్‌ (తాకట్టు) రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలోని విలువైన భూములను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు పెద్ద స్కెచ్‌ వేసినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయి, ప్రైవేట్‌ డెవలపర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ జీవో జారీ చేయడం విశేషం.

చంద్రబాబు కుటుంబ భూములన్నట్లు ధారాదత్తం
» ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నది చాలదన్నట్లు వారికి ఇంకా మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వెసులుబాట్లు కల్పించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఉర్సా వంటి కంపెనీలకు కేవలం రూపాయికే అత్యంత విలువైన భూములను కట్టబెట్టేందుకు సైతం వెనుకాడలేదు. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఊరూ పేరూ లేని బోగస్‌ కంపెనీలకు వందల, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారు.

» తాజా జీవో 395 ద్వారా మరింతగా బరితెగించి ప్రభుత్వానికి వచ్చే నామమాత్రపు సొమ్ము కూడా రాకుండా లీజులు, అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. మార్కెట్‌ విలువ ప్రకారం వందల కోట్ల రూపాయలు పలికే భూములను ఉచితంగానో, నామమాత్రపు ధరకో వివిధ కంపెనీలకు కేటాయిస్తున్నారు. తీరా ఆ డబ్బులు కూడా కట్టకుండానే ప్రైవేటు డెవలపర్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేసేయాలని ఏకంగా జీవో జారీ చేయడం విస్తుగొలుపుతోందని అధికార వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. 

» కేవలం లీజులకే పరిమితం కాకుండా ఆ భూములను అమ్మేసుకోవచ్చని.. ప్రభుత్వ భూములు తమ కుటుంబం భూములన్నట్లు చంద్రబాబు ఆ కంపెనీలకు ఇచ్చేయాలని జీవోలో పేర్కొనడం గమనార్హం. ఈ బోగస్‌ కంపెనీలు భవిష్యత్తులో ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే ప్రమాదం ఉంది.  

» ఈ కంపెనీలు తాము ఉచితంగా పొందిన ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో పెట్టి మార్టిగేజ్‌ (తాకట్టు) ద్వారా వందల కోట్ల రూపాయల రుణాలు పొందడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ ఆ కంపెనీలు బోర్డు తిప్పేస్తే, బ్యాంకులు ఆ ప్రభుత్వ భూములను జప్తు చేస్తాయి. అంటే కంపెనీలు పారిపోయినా నష్టపోయేది మాత్రం ప్రభుత్వమే.. ప్రజాధనమే. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అన్నదే మిగలకుండా చేసేందుకు చంద్రబాబు పెద్ద కుట్ర పన్నినట్లుగా తాజా జీవోను బట్టి స్పష్టమవుతోంది.

మాండ్ర మనోడే.. ఇచ్చెయ్‌..
టీడీపీ నేత శివానందరెడ్డి ‘వెసెల్లా’కు రూ.400 కోట్ల విలువైన భూమి  
కర్నూలులోని కల్లూరులో 5 స్టార్‌ హోటల్‌ పేరిట 20 ఎకరాలు 99 ఏళ్ల లీజుకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల పేరుతో భూ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి నాయకులు, అస్మదీయులకు ప్రభుత్వభూమి పంచడమే పనిగా చంద్రబాబు సర్కార్‌ పనిచేస్తోంది. కర్నూలు నగరంలో అంతర్భాగమైన కల్లూరులో రూ.400 కోట్లకుపైగా విలువైన 20 ఎకరాల ప్రభుత్వభూమిని టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వెసెల్లాకి కట్టబెట్టింది. మారియట్‌ బ్రాండ్‌ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం పార్కు, 5 స్టార్‌ హోటల్, రిసార్ట్‌–మెగా కన్వెన్షన్‌ హబ్‌ అభివృద్ధి పేరుతో 20 ఎకరాలను 99 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 

ఈ పర్యాటక స్థలానికి టీడీపీ నేత శివానందరెడ్డికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వెసెల్లా గ్రూప్‌ ఒక్కటే దరఖాస్తు చేసిందని, దీంతో కేటాయించేశామని ప్రభుత్వం పేర్కొనడం విమర్శనీయంగా మారింది. కేవలం కాగితంపై మారియట్‌ బ్రాండ్‌ చూపిస్తున్నారని, దానికి సంబంధించి ఆ సంస్థ, వెసెల్లా గ్రూప్‌ కన్సార్టియం ఊసే లేదని ఆతిథ్యరంగ నిపుణులు చెబుతున్నారు.  

పెట్టుబడిలో 40 శాతానికిపైగా రాయితీల రూపంలో వెనక్కి..  
కల్లూరులో శివానందరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రూ.210.14 కోట్ల పెట్టుబడితో 50 లగ్జరీ రిసార్ట్స్, ఐదువేలమంది సామర్థ్యంతో వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మిస్తుందని, దీనిద్వారా 150 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం కేటాయించిన 20 ఎకరాల ఈ భూమి విలువ మార్కెట్‌ రేటు ప్రకారం రూ.400 కోట్లకుపైనే. ఇక క్యాపిటల్‌ సబ్సిడీ, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, స్టాంప్‌డ్యూటీ మినహాయింపు, ఇతర పన్ను రాయితీలతో కలిపి పెట్టుబడిలో 40 శాతానికిపైనే అంటే రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు వెనక్కి ఇస్తుండటం గమనార్హం. అంటే.. రూ.210.14 కోట్ల ప్రాజెక్టుకు రూ.480 కోట్లు విలువైన భూమి, రాయితీలను ప్రభుత్వం ముట్టజెబుతుండటం చర్చనీయాంశమవుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement