అన్నమయ్య జిల్లా : అది జిల్లాలోనే ఒక మారుమూల గిరిజన గ్రామం. కేవలం 345 కుటుంబాలు, 1,282 జనాభా, 1,120 ఓటర్లు ఉన్న చిన్న బంజారా తండా. కానీ, నేడు ఆ ఊరు అక్షరాస్యతలో, ఉద్యోగాల సాధనలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అదే అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండల పరిధిలోని పెద్దబిడికి గ్రామం.
కష్టం చిన్నది.. చదువు పెద్దది
ఈ గ్రామంలోని వారంతా చిన్న, సన్నకారు గిరిజన రైతులే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉన్నా, పిల్లల చదువుల కోసం ఆ తల్లిదండ్రులు పడిన శ్రమ వృధా కాలేదు. ప్రస్తుతం ఈ చిన్న ఊరి నుండి 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా, మరో 80 మందికి పైగా ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇక్కడి నుండి ఉద్యోగాలు సాధించిన వారంతా కలిసి పుట్టిన ఊరిని మర్చిపోకుండా, స్థానిక పాఠశాల పిల్లలకు నోటు పుస్తకాలు, బట్టలు అందిస్తూ, గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊరిలో ఎంతటి విద్యా చైతన్యం ఉందంటే.. ఏ ప్రభుత్వ పథకం గురించి అడిగినా ప్రజలు ఠక్కున సమాధానం చెప్పగలరు.

నిబద్ధతతో ఏదైనా సాధ్యం
మాది పేద కుటుంబం. తల్లిదండ్రుల కృషి, ఊరి పెద్దల సహకారంతోనే ఐఏఎస్ అయ్యాను. యువత నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు.
– డాక్టర్ హరిజవహర్‌లాల్ దేవదాయశాఖ కమిషనర్, ఐఏఎస్
ఊరంటే ఎంతో గౌరవం
పేదరికాన్ని దగ్గరగా చూశాను. మా తల్లిదండ్రుల కష్టం వల్లే చీఫ్ ఇంజినీర్ స్థాయికి వచ్చాను. నా ఊరంటే నాకు ఎంతో గౌరవం, వీలున్నప్పుడల్లా ఊరి అభివృద్ధిపై చర్చిస్తుంటాను.
– బి.బాలునాయక్ ఈఎన్‌సీ, పంచాయతీరాజ్, ఏపీ
పేద విద్యార్థులకు ప్రోత్సాహం
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా. సెలవులు దొరికితే చాలు ఊరికి వచ్చి పేద విద్యార్థులకు నా వంతుగా విద్యా ప్రోత్సాహకాలు అందిస్తున్నాను.
– ఎం.మునీంద్రనాయక్ మండల విద్యాశాఖాధికారి, కలకడ
ఉద్యోగావకావశాలపై అవగాహన
నిరుపేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి చదువుకున్నాను. ఇప్పుడు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కలి్పస్తున్నాను. ఊరి ప్రగతికి నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది.
– ఎం.బాలునాయక్, డెప్యూటీ కమిషనర్, కారి్మక శాఖ, కర్నూలు


