యల్లనూరు: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మండలంలోని నీర్జాంపల్లికి చెందిన బాధితుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకటరాముడు తెలిపిన మేరకు.. వెంకటరాముడు కుమారుడు హరి, అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇటీవల ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అమ్మాయి తరఫు వారు వెంకటరాముడును అంతమొందించేందుకు ప్లాన్ వేశారు. ఇటీవల తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి నీర్జాంపల్లి గ్రామానికి వెళ్లగా వెంకటరాముడు, హరితో పాటు మరి కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు అశోక్, క్రిష్ణార్జున, గంగా మహేష్, త్రిలోక్, సంతోష్, మల్లిఖార్జున, ఓబులేసు, రమేష్, కుమార్, రాజేష్, గంగయ్యతో పాటు మరికొందరు ఆదివారం రాత్రి వెంకటరాముడుపై దాడి చేసేందుకు అతని ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. వెంకటరాముడు తలపై రాళ్లు,కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో టీవీ, బీరువా, ఇనుప కిటికీలు ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం సాయంత్రం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెంకటరాముడు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్త అశోక్ అండ చూసుకుని తనపై దాడి చేశారని వాపోయాడు. ఇదిలా ఉండగా, వెంకటరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని పోలీసులు టీడీపీ నాయకుల ఒత్తిడితో అతని కుమారుడు హరిపై మాత్రం పోక్సో కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


