అదిగదిగో రబీ.. విత్తనమేదీ..?
● రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖ రుతో ముగియనుంది. అక్టోబర్ ఒకటి నుంచి ‘రబీ’ మొదలు కానుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2.57 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రబీపై గంపెడాశలు పెట్టుకుని సాగుకు సిద్ధమవుతున్నారు.
వారం రోజుల్లో రబీ మొదలు కానున్నా చంద్ర బాబు ప్రభుత్వం రాయితీ విత్తనంపై ఎటూ తేల్చకపోవడంపైసర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపాదనలు పంపినా..!
రబీలో ప్రధానపంటగా పప్పుశనగ 70 వేల నుంచి 80 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణం అంచనా వేశారు. ఉరవకొండ, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు తదితర 25 మండలాల పరిధిలో ఉన్న నల్లరేగడి భూముల్లో పప్పుశనగ విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల వర్షం కూడా పడటంతో ముందస్తు సాగుకు రెడీ అవుతున్నా రాయితీ విత్తన పంపిణీ సన్నాహకాలు చేయకపోవడం గమనార్హం. 45 వేల క్వింటాళ్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపినా ఇంకా అనుమతులు ఇవ్వలేదు.
సేకరణ, పంపిణీ ఆలస్యం
2024 ఖరీఫ్, రబీ,2025 ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ పంపిణీకి సంబంధించి సరఫరాదారులకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.90 కోట్ల మేర పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ రబీలో విత్తన సేకరణ, పంపిణీ ఆలస్యం కానున్నట్లు తెలిసింది.


