అనంతపురం అర్బన్: జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల విస్తరణకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ అంశంపై జేసీ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఏపీఎస్‌పీడీసీఎల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణకు సంబంధించి డీపీఆర్ చాలా కీలకమన్నారు. ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. పురోగతిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్‌హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
టపాసుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం డివిజన్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్ తెలిపారు. నాలుగు సెట్ల దరఖాస్తులు అక్టోబర్ 15లోగా ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తుదారులు స్వయంగా వచ్చి దరఖాస్తులు అందజేయాలని, ఇతరుల ద్వారా వచ్చిన వాటిని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. పోలీసు విచారణ అనంతరం అర్హత ఉన్న వారికి జీఎస్టీ, అగ్నిమాపక శాఖ చలానా, ఎన్‌ఓసీ సమర్పించిన తర్వాతే లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుత ఏడాదికి లైసెన్సు పొందిన వారే విక్రయాలకు అర్హులని, గత లైసెన్సులు చెల్లుబాటు కావన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు.
29 మండలాల్లో కరువు!
● ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కరువు మండలాలను ప్రకటించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ ద్వారా 29 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, రాయదుర్గం మండలాల్లో తేలికపాటి వర్షం పడడం, 21 రోజుల వర్షపాత విరామం (డ్రైస్పెల్) నమోదు కానందున వీటిని పక్కనపెట్టినట్లు తెలిసింది.
తాగునీటి సమస్యలపై
కంట్రోల్ సెంటర్
అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. 95504 80972కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెంటర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.


