● కణేకల్లులో కుండపోత
అనంతపురం అగ్రికల్చర్/కణేకల్లు: మూడు రోజులుగా వరుణుడు కరుణిస్తున్నాడు. ఒట్టిపోయిన వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ప్రవహిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడో రోజు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా వర్షాలు కురిశాయి. కణేకల్లులో 80 మి.మీ కుండపోత నమోదైంది. మొత్తంగా 27 మండలాల పరిధిలో 17.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లోనే ఏకంగా 67 మి.మీ వర్షపాతం రికార్డయింది. కణేకల్లులో 80 మి.మీతో పాటు గుత్తి 60.2, బెళుగుప్ప 46.8, ఉరవకొండ 46.4, యాడికి 39.2, కళ్యాణదుర్గం 38.6, కంబదూరు 34.6, శెట్టూరు 34.2, పెద్దవడుగూరు 33.8, విడపనకల్లు 21.6 మి.మీ వర్షం కురిసింది. కూడేరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్ మినహా మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షాలు కురిసిన రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడా కొంత పంటనష్టం వాటిల్లడం, ఖరీఫ్ పంటలకు ఉపయోగం లేకున్నా మూడు నెలల తర్వాత కురిసిన వర్షాల వల్ల ప్రత్యామ్నాయం, రబీకి ఊరటనిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్ సాధారణం 111.6 మి.మీ గానూ ప్రస్తుతానికి 71.3 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి 278.8 మి.మీ గానూ 31 శాతం తక్కువగా 192.5 మి.మీ నమోదైంది. మూడు రోజుల కిందట వరకు 52 శాతం లోటు వర్షం ఉండగా తాజాగా 31 శాతానికి తగ్గింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.


