● పడరాని పాట్లు పడుతున్న హీమోఫీలియా బాధితులు
● శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గుడ్డంపల్లి తండాకు చెందిన శివప్రసాద్
హీమోఫీలియాతో బాధపడుతున్నాడు. ఆయనకు జారీ చేసిన సదరం ధ్రువపత్రంలో 44 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పింఛన్ కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో 40 శాతంలోపు ఉన్నట్లు చూపిస్తుండటంతో పింఛన్‌కు అర్హులు కాదని సిబ్బంది
చెబుతున్నారని బాధితుడు వాపోతున్నాడు. సదరం సర్టిఫికెట్‌లో ఒక శాతం.. ఆన్‌లైన్‌లో మరో శాతం చూపిస్తుండటంతో అసలు ఏది ప్రామాణికమో తెలియక బాధితులు అయోమయానికి గురవుతున్నారు.
రాప్తాడు రూరల్: హీమోఫీలియా అనేది అరుదైన వంశపారంపర్య, జన్యుపరమైన వ్యాధి. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కారకాలు (క్లాటింగ్ ఫ్యాక్టర్స్) లోపించడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి బాధితులకు తరచూ వైద్య చికిత్సలు, మందులు అవసరం అవుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద కుటుంబాలకు ఈ వ్యయం భారంగా మారుతున్న నేపథ్యంలో, బాధితుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందజేసింది. ఉమ్మడి జిల్లాలో 50 మంది వరకు పింఛన్ పొందుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మరో 130 మంది వరకు అర్హులు ఉన్నట్లు తెలిసింది. సదరం ధ్రువపత్రం తప్పనిసరి కావడంతో కొత్తగా పింఛన్ పొందాల్సిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నెలలుగా ఎదురుచూపులు
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు బాధితులకు ఇప్పటివరకు ధ్రువపత్రాలు మంజూరు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన స్లాట్ ద్వారా ముందుగా నమోదు చేసుకుని, అనంతరం వైద్య పరీక్షలకు హాజరైనప్పటికీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు చేతికి అందకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్ కోసం బాధితులు సచివాలయాలు, ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. పింఛన్ కోత విధించేందుకే ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టారా.. అని ప్రశ్నిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


