‘గురజాడ’ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

‘గురజాడ’ సేవలు చిరస్మరణీయం

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

అనంతపురం అర్బన్‌: తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు గురజాడ అప్పారావు అందించిన సేవలు చిరస్మరణీయమని జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల పాల్గొని గురుజాడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాటాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలను తన రచనల ద్వారా ఎత్తిచూపి ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గురజాడ సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేస్తూ వ్యవహారిక భాషకు ప్రాధాన్యత కల్పించడంలో గురజాడ చేసిన కృషి విశేషమైనదన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమణరెడ్డి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి అలెగ్జాండర్‌, కోఆర్డినేషన్‌ విభాగం సూపరింటెండెంట్‌ యుగేశ్వరిదేవి, భూ విభాగం సూపరింటెండెంట్‌ రియాజుద్ధీన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూతో

రెండు సంస్థల అవగాహన

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం రెండు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ’గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ’, బెంగళూరుకు చెందిన ’టెక్నోహబ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ’ సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలపై (ఎమ్‌ఓయూ) సంతకాలు చేసింది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందాలు విద్యార్థులు, అధ్యాపకుల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. సాంకేతికత ఆధారిత విద్య, పరిశోధనలు, ప్రాజెక్టు శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి. దుర్గా ప్రసాద్‌, డీఏపీ ప్రొఫెసర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, ప్రొఫెసర్‌ ఆర్‌. భవానీ, ప్రొఫెసర్‌ వైశాలి గోర్పడే, ఏ.సురేష్‌ బాబు, వి.నాగ ప్రసాద్‌ నాయుడు, పి.ఆర్‌.భానుమూర్తి, పి. సుజాత, సి.శోభా బిందు, జి. వి.సుబ్బా రెడ్డి, ఏపీ శివ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement