ఆ తండ్రికి అదే చివరి ఫోన్‌ కాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆ తండ్రికి అదే చివరి ఫోన్‌ కాల్‌

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

రాప్తాడు రూరల్‌: ఆ తండ్రికి తనయుడు చేసిన ఆ ఫోన్‌కాలే చివరిదైంది. ‘నాన్నా..అత్తకు బాగో లేదంట.. చూపించుకునేందుకు తిరుపతికి వెళ్తారంట..’ అంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పే ప్రయత్నం చేయగా.. ‘నువ్వు నాతో మాట్లాడొద్దు.. ఫోన్‌ పెట్టేయ్‌’ అంటూ తండ్రి ఆగ్రహంవ్యక్తం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం రూరల్‌ మండలం కృష్ణంరెడ్డిపల్లిలో ఆదివారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన గోగుల రామాంజనేయులు ఆటోడ్రైవరుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు గోగుల మోహన్‌కృష్ణ (21) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడంతో పదేళ్ల క్రితం తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రీకొడుకులిద్దరే ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఏడు నెలలుగా మాటలు లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా జీవిస్తున్నారు. మోహన్‌కృష్ణ కింది గదిలో పడుకుంటే.. తండ్రి పైఅంతస్తులో నిద్రించేవాడు. కొడుకు సంపాదన తండ్రికి ఇవ్వకపోవడం, ఖరీదైన బైకు, మొబైల్‌ కొనుగోలు చేయడం తదితర విషయాల్లోనూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలతో మోహన్‌కృష్ణ తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.

ఎవరి కోసం బతకాలి!

ఆదివారం సాయంత్రం మోహన్‌కృష్ణ తన స్నేహితుల వద్ద ఇంట్లో పరిస్థితిని చెప్పుకుని బాధపడినట్లు తెలిసింది. ‘ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండటం లేదు.. నాన్న నాతో మాట్లాడటం లేదు.. ఎవరి కోసం బతకాలి? పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే ఇంట్లోనే మనశ్శాంతి లేకుండా పోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్నేహితులతో ఇలా మాట్లాడిన కొన్ని గంటల్లోనే అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి 9.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్‌ చేసి అత్త అనారోగ్య విషయం చెప్పేందుకు ప్రయత్నించాడు. తండ్రి ఫోన్‌ పెట్టేయమని చెప్పడంతో ఆ తర్వాత మోహన్‌కృష్ణ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

తల్లి ఫిర్యాదుతో క్లూస్‌ టీం పరిశీలన

సమాచారం అందుకున్న మోహన్‌కృష్ణ తల్లి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుంది. మృతదేహానికి చీమలు పట్టి ఉండటం, అక్కడక్కడా గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సీఐ హేమంత్‌కుమార్‌, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసుల సమాచారంతో క్లూస్‌ టీం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలను పరిశీలించింది.

ఆత్మహత్యగా వైద్యుల నిర్ధారణ

మృతదేహంపై గాయాల విషయంపై సీఐ హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ..మోహన్‌కృష్ణది ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారని తెలిపారు. చీమలు కుట్టడం వల్లే అక్కడక్కడా గాయాలు ఏర్పడినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు.

విషాదం నింపిన యువకుడి

బలవన్మరణం

చివరి సారిగా తండ్రికి

ఫోన్‌ చేసి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement