● శిక్షణా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి
● జిల్లా రెవెన్యూ అధికారి మలోల
అనంతపురం ఎడ్యుకేషన్: 2027 జనాభా గణనలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) తయారీకి సంబంధించిన క్షేత్రస్థాయి సమాచార సేకరణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను గడువులోపు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిధిలోని ఛార్జ్ సెన్సస్ అధికారులు, అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణానికి ఒక ఫీల్డ్ ఫంక్షనరీని నియమించడం, వారికి యూజర్ ఐడీలు రూపొందించడం, గ్రామాలు–పట్టణాల మ్యాపింగ్ పూర్తి చేయడం, శిక్షకుల ఎంపిక, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, డీసీహెచ్‌బీ మొబైల్ యాప్‌పై సమగ్ర శిక్షణ వంటి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. శిక్షణా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు సూర్యనారాయణ రెడ్డి, వీరనారాయణ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు డీసీహెచ్‌బీ మొబైల్ యాప్‌పై పూర్తి అవగాహన పొందిన అనంతరం మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులకు సమర్థవంతంగా శిక్షణ అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 7 నుంచి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మండలాల్లో ఫీల్డ్ ఫంక్షనరీలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు తమ పరిధిలో డీసీహెచ్‌బీ కోసం క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అనంతపురం తహసీల్దార్ రాజా, సెన్సస్ విభాగం డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.


