కణేకల్లు: బడి వేళకు బస్సు నడపాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. నాగేపల్లి రోడ్డుపై ముళ్ల కంపలు వేసి రాకపోకలు స్తంభింపజేశారు. నాగేపల్లికి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు మాల్యం జెడ్పీ హైస్కూలులో చదువుతున్నారు. తొమ్మిది గంటలకు స్కూలు ప్రారంభమవుతుంది. అయితే రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామానికి ఉదయం 7.30 గంటలకు వస్తోంది. ఆ విద్యార్థులు టిఫిన్ చేసి బస్సు పాయింట్ వద్దకు చేరుకోవడానికి సమయం సరిపోవడం లేదు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు సకాలంలో బడికి వెళ్లలేకపోతున్నారు. పాఠాలు కోల్పోతూ చదువులో వెనకబడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా బస్సు వేళలు మారలేదు. మంగళవారం ఉదయాన్నే యూనిఫాంలో బస్‌పాయింట్ వద్దకు చేరుకున్న విద్యార్థులు బడికి వెళ్లలేకపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుపై ముళ్లకంపలు వేసి ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. బడి వేళకు బస్సు నడుపుతామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. డ్రైవర్, కండక్టర్ ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా విషయం చేరవేశారు. అయితే అక్కడి నుంచి స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. చేసేది లేక విద్యార్థులు ఆందోళన విరమించారు.
విద్యార్థులు సహకరించాలి
రాయదుర్గం డిపోకు చెందిన బస్సును బళ్లారి వరకు నడుపుతాం. ఈ బస్సు కణేకల్లులో ఉదయం ఆరు గంటలకు బయల్దేరితే దర్గా హొన్నూరుకు ఏడు గంటలకు వెళ్తుంది. అయితే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లకుండా... విద్యార్థుల సౌకర్యార్థం తిరిగి కణేకల్లుకు తిప్పుతున్నాం. బిదురకుంతం, మీన్లహళ్లి, గరుడచేడు, తుంబిగనూరు మీదుగా నాగేపల్లికి చేరుకునే సరికి 7.30 అవుతోంది. అయితే బడి వేళ కన్నా ముందుగా వస్తోందని, గంట ఆలస్యంగా నడపండని విద్యార్థులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఉదయం 7.45 గంటలకు నాగేపల్లికి వచ్చేలా అంటే ప్రస్తుతమున్న సమయం కన్నా 15 నిమిషాలు ఆలస్యంగా నడుపుతాం. విద్యార్థులు కూడా సహకరించి ఆ సమయానికి సిద్ధం కావాలి.
– శ్రీనివాసరావు,
ఆర్టీసీ డిపో మేనేజర్, రాయదుర్గం


