సమ్మెలో జూడాలు | - | Sakshi
Sakshi News home page

సమ్మెలో జూడాలు

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

అనంతపురం సిటీ: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్‌ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లారు. జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళ వారం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టయిపండ్‌ సవరణ చేయాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు అంతరాయం కలగకూడనే ఉద్దేశంతో తాము ఇప్పటి వరకూ వేచి ఉన్నామని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

యల్లనూరు ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం ఎడ్యుకేషన్‌/ యల్లనూరు: విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.శ్రీరామమూర్తిపై ఈ చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్న కొందరు విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించారన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీనిపై యల్లనూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఆరోపణలకు సంబంధించిన అంశాలను విచారణలో పరిశీలించినట్లు తెలిసింది. ఎంఈఓ నివేదికను పరిశీలించిన అనంతరం విద్యాశాఖ అధికారులు శ్రీరామమూర్తిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి, నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడం ప్రస్తుతం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి శాఖాపరమైన చర్యలు నిబంధనల ప్రకారం కొనసాగనున్నాయని డీఈఓ అబ్దుల్‌ హుస్సేన్‌ తెలిపారు.

జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలు

బెళుగుప్ప: జీడిపల్లి రిజర్వాయర్‌కు మంగళవారం కృష్ణాజలాలు చేరాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని మల్యాల నుంచి ఎనిమిది లిఫ్టుల ద్వారా ఈ నెల ఐదో తేదీ నుంచి కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాల వరప్రదాయిని అయిన ‘అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి’ ప్రాజెక్టు కాలువలకు అధికారులు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. జిల్లాలోని రాగులపాడు వద్ద ఎనిమిదవ నంబర్‌ పంపుహౌస్‌ నుంచి కృష్ణాజలాలను సోమవారం నుంచి ఎత్తిపోయడంతో హంద్రీ–నీవా కాలువల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం రాగులపాడు వద్ద లిఫ్టు పంపుల ద్వారా నీరు ఎత్తిపోతలతో ప్రస్తుతం కాలువల ద్వారా 1800 క్యూసెక్కుల నీరు జీడిపల్లి రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోందని స్థానిక జేఈ పృథ్వీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ఆలస్యంగా జీడిపల్లి రిజర్వార్‌కు కృష్ణాజలాలు వచ్చి చేరాయి.

నలుగురు బీఎల్‌ఓల సస్పెన్షన్‌

గుత్తి: మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన నలుగురు బీఎల్‌ఓలను సస్పెండ్‌ చేస్తూ సోమవారం రాత్రి కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌మియా మంగళవారం చెప్పారు. ‘సర్‌’ వివరాలను ఎలక్షన్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయలేదు. దీంతో సంబంధిత బీఎల్‌ఓలు శాంతకుమారి (వార్డు రెవెన్యూ సెక్ట్రెటరీ), బి.అనిల్‌ బాబు (వార్డ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రెటరీ), టి.గంగాధర్‌ (వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రెటరీ), వై.నాగేశ్వరి (వార్డ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రెటరీ)లను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement