అనంతపురం సెంట్రల్: అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీల నీరు మాత్రమే కేటాయించారు. అది కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం కర్ణాటకలో జరిగిన తుంగభద్ర బోర్డు మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు తెలిపారు. ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్‌లోనూ పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చునని భావించిన తుంగభద్రబోర్డు అధికారులు ఈ ఏడాది జలాశయానికి నీటి లభ్యత 170 టీఎంసీలుగా లెక్క కట్టారు. ఇటీవల తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జలాశయంలోకి భారీస్థాయిలో నీరు వచ్చింది. ప్రస్తుతం నీటి మట్టం 82.599కు చేరుకోగా 41167 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ లెక్కన హెచ్చెల్సీతో పాటు అన్ని ప్రధాన కాల్వలకూ నీటి కేటాయింపులు చేశారు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 15 టీఎంసీలు విడుదల చేసేలా నిర్ణయించారు. భవిష్యత్తులో నీటి లభ్యత పెరిగితే నీటి కేటాయింపులు పెరిగే అవకాశమూ లేకపోలేదు.
మొత్తం తాగునీటికే..
తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి ఈఏడాది అత్యల్పంగా నీరు కేటాయించడంతో రానున్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్లు రిజర్వాయర్లలో నిల్వ చేయాలని నిర్ణయించారు. కణేకల్లు చెరువు, గుంతకల్లు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే ఆర్‌డబ్ల్యూఎస్ స్కీములకు నీటిని విడుదల చేశారు. తక్కిన నీటిని నేరుగా పీఏబీఆర్‌లో నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకం ద్వారా అనంతపురం నగరపాలకసంస్థకు, శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకాల ద్వారా అన్ని నియోజకవర్గాలకూ నీటిని సరఫరా చేయనున్నారు.
సాగు చేయడానికి వీల్లేదు
తుంగభద్ర జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు చేశారు. ప్రస్తుతం నీటి లభ్యత.. అంచనా ఆధారంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని మొత్తం తాగునీటికే వినియోగించనున్నాం. ఎక్కడా పంటలు సాగు చేయడానికి వీల్లేదు. నిన్నటి వరకు 500 క్యూసెక్కులు మాత్రమే వచ్చేవి. మంగళవారం నుంచి 800 క్యూసెక్కులకు పెంచాం. గురువారం నాటికి 1500 క్యూసెక్కులు తీసుకోవాలని భావిస్తున్నాం. రైతులు, ప్రజలు సహకరించాలి.
– సుధాకర్‌రావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
హెచ్చెల్సీపై నిరంతర నిఘా
అనంతపురం అర్బన్: తుంగభద్ర హై లెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సీ) ద్వారా నీరు వస్తున్నందున కాలువ వెంబడి నిరంత నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఈ నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. హెచ్చెల్సీ ద్వారా వస్తున్న నీటిని ఎవ్వరూ అక్రమంగా వినియోగించకుండా చూసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు కాలువ వెంబడి నిరంతరం నిఘా ఉంచుతాయన్నారు. ఎవరైనా అక్రమ పద్ధతిలో నీటిని తోడుకోవడం, పైప్‌లైన్ ద్వారా మళ్లించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
హెచ్చెల్సీకి 15 టీఎంసీలే
తుంగభద్ర మొదటి బోర్డు సమావేశంలో నిర్ణయం
కనిష్ట స్థాయిలో నీటి కేటాయింపులు
తాగునీటి అవసరాలకు మాత్రమే


