హనుమా.. మముగనుమా! | - | Sakshi
Sakshi News home page

హనుమా.. మముగనుమా!

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

శ్రావణ వేడుకలకు ముస్తాబైన

హనుమద్‌ క్షేత్రాలు

15న తొలి శ్రావణ శనివారం పూజలు

ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

బొమ్మనహాళ్‌: ఆంజనేయస్వామి దేవాలయాలను దేదీప్యమానం చేసే శుభప్రదమైన శ్రావణ మాసం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురం తదితర ఆలయాల్లో శ్రావణంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణంలో రథోత్సవాలు కనులపండువగా సాగనున్నాయి. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులకు అన్నదానం ఉంటుంది. మూడు ఆలయాలను ఒకే రోజు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలలో మూడు ఆలయాల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తలు పోటెత్తుతారు. ఈ క్రమంలో భక్తకోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలు, వసతి గృహాలు సిద్ధం చేస్తున్నారు.

మహాపుణ్య ప్రాప్తి..

క్రీ.శ. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ పాలనలో ఆయన గురువైన వ్యాస మహర్షి ఒకే రోజున నేమకల్లు, మురిడీ, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కుహుదోషంతో సింహాసనం కోల్పోయిన శ్రీకృష్ణదేవరాయల దోషం పోయేందుకు 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించారని, ముందుగా హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయస్వామి విగ్రహం, పెనుకొండ వద్ద 103 విగ్రహాలను ప్రతిష్టించి చివరకు నేమకల్లు, మురడి, కసాపురాల్లో ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు పెద్దలు చెబుతారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మూడడుగుల స్థలాన్ని తీసుకున్న ప్రాంతాలుగా ఉన్నాయని చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. శ్రావణ మాసంలో మూడు దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే మహా పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

బాలాలయల్లోనే దర్శనాలు..

నేమకల్లు, మురడి, కసాపురంలో ప్రస్తుతం ఆలయాల జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగమశాస్త్రం ప్రకారం మూలవిరాట్లకు విశ్రాంతి ఇచ్చి బాలాలయాల్లో చెక్కతో రూపొందించిన ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తున్నారు. బాలాలయాల్లోనే స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని దేవదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యులు తెలిపారు.

కసాపురం ఆంజనేయస్వామి దేవాలయం, బాలాలయంలో నేమకల్లు ఆంజనేయస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement