తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో పోలీసులు మరోమారు అత్యుత్సాహం ప్రదర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ భగత్‌సింగ్‌నగర్ ప్రధాన రహదారిపై నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడినుంచి పంపించేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ నేతల కార్యక్రమాలకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలు ఏవి చేసినా అనుమతి లేదంటూ అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సాగిస్తున్న అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్‌బాషా, నాయకులు పేరం స్వర్ణలత, కంచం రామ్మోహన్‌రెడ్డి, కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, రాబర్ట్, విజయ్‌కాంత్‌రెడ్డి, వేమనాథరెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్ట్
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారన్న సమాచారం తెలియగానే వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. అయితే వీరిని ముచ్చుకోట వద్దే పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్దిరెడ్డి, అనంత, నరేష్‌కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ఉండకూడదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న కుట్రలకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. మంత్రి లోకేష్ డైరెక్షన్‌లోనే డీఎస్సీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.లక్షలకు అమ్ముకున్నారన్నారు.


