నలుగురు బీఎల్‌ఓలపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

నలుగురు బీఎల్‌ఓలపై సస్పెన్షన్‌ వేటు

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

అనంతపురం అర్బన్‌: గుత్తి మునిసిపాలిటీకి చెందిన నలుగురు బీఎల్‌ఓలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. సస్పెండ్‌ అయిన బీఎల్‌ఓలలో శాంతకుమారి, బి.అనిల్‌బాబు, టి.గంగాధర్‌, వై.నాగేశ్వరి ఉన్నారు. గుత్తి ఏఈఆర్‌ఓ, మునిసిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నారు. గుత్తి అర్బన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు కొందరు ఉద్యోగులను బీఎల్‌ఓలుగా నియమించారు. కొత్తగా నియమితులైన బీఎల్‌ఓల వివరాలను ఎన్నికల పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) రూపొందించి సంబంధిత బీఎల్‌ఓల నమోదిత మొబైల్‌ నంబర్‌కు పంపుతారు. ఓటీపీని ధ్రువీకరించిన తరువాత బీఎల్‌ఓలు వివరాలను ఎన్నికల పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. అయితే కొత్తగా నియమితులైన బీఎల్‌ఓలు ఏఈఆర్‌ఓ అభ్యర్థనలను పెడచెవిన పెట్టారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి నివేదిక ఇవ్వడంతో కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

యల్లనూరు జెడ్పీ హైస్కూల్‌లో కీచక టీచర్‌!

యల్లనూరు: యల్లనూరు జెడ్పీ హైస్కూల్‌లో ఓ కీచక టీచర్‌ బాగోతం వెలుగు చూసింది. పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీరామమూర్తి 8,9వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకుతున్నట్లు తెలిసింది. టీచర్‌ ఆకతాయి చేష్టలతో విసిగిపోయిన ముగ్గురు విద్యార్థినులు సోమవారం ఎంఈఓ చంద్రశేఖర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగస్వామికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఈఓ చంద్రశేఖర్‌ విద్యార్థినుల ఫిర్యాదును డీవైఈఓకు పంపించారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహంతో హైస్కూల్‌ వద్దకు చేరుకున్నారు. శిక్షణ నిమిత్తం సదరు ఉపాధ్యాయుడు అనంతపురం వెళ్లాడని తెలియడంతో తిరిగి వెనక్కి వెళ్లారు.

నేడు ఐసీసీ భేటీ

బొమ్మనహాళ్‌: తుంగభద్ర నీటి పారుదల సలహా కమిటీ (ఐసీసీ) సమావేశం మంగళవారం జరగనుంది. ప్రస్తుత నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, వర్షపాత అంచనాలు, తాగునీటి అవసరాలు, ఆవిరి నష్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని ఎప్పటి నుంచి విడుదల చేస్తారన్న అంశంపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పంటకు మాత్రమే నీరు అందించే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ తెలిపారు.

చెలరేగిన మోనీష్‌, శశాంక్‌

అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్‌ మెన్స్‌ సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లా మల్టీడే క్రికెట్‌ టోర్నీలో చిత్తూరు జట్టు బ్యాటర్లు చెలరేగారు. సోమవారం నెల్లూరు జట్టుతో తలపడిన చిత్తూరు జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 78.3 ఓవర్ల వద్ద 437 పరుగులు సాధించి ఆలౌట్‌ అయింది. జట్టు బ్యాటర్‌ కేఆర్‌ మోనీష్‌ చౌదరి 115 బంతుల్లో 131 పరుగులు, శశాంక్‌ శ్రీవాత్సవ్‌ 103 బంతుల్లో 101 పరుగులు సాధించారు. నెల్లూరు బౌలర్లలో ఎస్‌.భార్గవ్‌ మహేష్‌ 4 వికెట్లు కూలదోశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన నెల్లూరు జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 4 ఓవర్లలో 11 పరుగులు సాధించింది.

● అనంతపురం, కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 375 పరుగులు సాధించింది. బ్యాటర్‌ ఎ.సాయి సూర్యతేజారెడ్డి 133 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. తౌఫిక్‌ హుస్సేన్‌ 72 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. అనంత బౌలర్లలో పి.గిరినాథరెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు.

వర్షం కోసం యాగం

బెళుగుప్ప: స్థానిక రామేశ్వరస్వామి ఆలయంలో వరుణ దేవుని కరుణ కోసం వరుణ యాగం నిర్వహించారు. 11 మంది వేద పండితులతో కలసి సుంకేసుల సత్యనారాయణరావు వరుణ యాగ పూజాది క్రతువులు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో మూలవిరాట్‌ వద్ద నీటిలో కూర్చుని జపం చేశారు. ఈ సందర్భంగా వేదపండితుడు సత్యనారాయణరావు మాట్లాడుతూ వానలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement