‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

గుంతకల్లు రూరల్‌: గుంతకల్లు పట్టణంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పట్టణంలోని పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటున్న పెద్ద మస్తాన్‌, లక్ష్మిదేవి దంపతులకు కుమారుడు తిమ్మప్ప(16)తో పాటు ఓ కుమార్తె ఉన్నారు. గుంతకల్లు నారాయణ కాలేజీలో తిమ్మప్ప ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం తండ్రి పెద్ద మస్తాన్‌ పని నిమిత్తం ఎమ్మిగనూరు వెళ్లగా, తల్లి లక్ష్మిదేవి స్థానిక ఎస్టేట్‌ సమీపంలో వినాయక విగ్రహాల తయారీ పనులకు వెళ్లింది. కళాశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తిమ్మప్ప తలుపులు వేసుకుని పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. అదే సమయానికి ఇంటి వద్దకు చేరుకున్న తల్లి లక్ష్మిదేవి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి ఉరికి వేలాడుతున్న కుమారుడిని కిందకు దించి వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తిమ్మప్ప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించండి

అనంతపురం అర్బన్‌: ఎయిడ్స్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఎయిడ్స్‌పై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ నియంత్రణలో ప్రజల అవగాహనే కీలకమన్నారు. హెచ్‌ఐవీ వ్యాప్తిని నివారించడం, ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో చికిత్స పొందడం, హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులపై వివక్షను తొలగించడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ నెల 12 నుంచి అక్టోబరు 12 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హెచ్‌ఐవీపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్ష తొలగించే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి విజయలక్ష్మి, జిల్లా సూపర్‌వైజర్లు రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక కొత్తూరు ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలలో వోకేషనల్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎంఎల్‌టీ) కోర్సులో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బి.ఉషాకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 12లోపు దరఖాస్తులను కళాశాలలో స్వయంగా అందజేయాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

నేతన్న నేస్తం

అక్రమాలపై నిగ్గు తేల్చాలి

తాడిపత్రిటౌన్‌: రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని చేనేత వృత్తికి సంబంధం లేని వ్యక్తులకు నేతన్న నేస్తం పథకం వర్తింపజేశారని పెద్దపప్పూరు మండలానికి చెందిన చేనేత కార్మికులు ఆరోపించారు. అక్రమాలపై నిగ్గు తేల్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. పెద్దపప్పూరు మండలంలోని కుమ్మెత, పసలూరు, నరసాపురం గ్రామంలో నిజమైన చేనేతలకు అన్యాయం చేశారన్నారు. 200 యూనిట్ల సబ్సిడీ విద్యుత్‌, చేనేత మిషన్లు, బ్యాంకు లోన్‌లు పొందిన తమకు నేతన్న నేస్తం అందలేదని వాపోయారు.ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. వినతిపత్రం అంద జేసిన వారిలో పెద్దన్న, బాలాజీ, గోపాల్‌, మురళీ, నాగరాజు తదితరులు వున్నారు.

ఆ రైతు మృతి

కూడేరు: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూడేరుకు చెందిన రైతు గొల్ల ఎర్రిస్వామి (30) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎర్రిస్వామికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పొలంలో పంటల సాగుకు చేసిన అప్పులు అధికమై వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement