● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్: సామాజిక భద్రత పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు పోటెత్తారు. రెండేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా పింఛన్ మంజూరు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, వెంకటనారాయణ, కిరణ్మయితో కలిసి ప్రజల నుంచి 622 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై 291 అర్జీలు, ఇతర సమస్యలపై 331 అర్జీలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పింఛన్ కోసం విన్నవించుకున్నారు. పింఛన్ మంజూరు చేస్తే కుటుంబానికి ఆదరువుగా ఉంటుందని వేడుకున్నారు. అనంతరం అర్జీలపై కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.


