మడకశిరరూరల్: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మడకశిర ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడుకొండలు బుధవారం తెలిపారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఎంపీసీ–రైతు కోటా కింద బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 27 సీట్లు, మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో 20 సీట్లు (2– ఈడబ్యూఎస్) అందుబాటులో ఉన్నాయి. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ అభ్యర్థులకు 73 సీట్లు, ఎంపీసీ రైతు కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో 32 సీట్లు ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి జనరల్–ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 17 నుంచి 22 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది.
రైతు కోటా నిబంధనలిలా..
రైతు కోటా కింద దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించి అభ్యర్థి తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరున ఎకరా పొలంతో పాటు విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ నాన్– మున్సిపాలిటీ ప్రాంతంలోని పాఠశాలలో 4 సంవత్సరాలు చదివి ఉండాలి. తహసీల్దార్ ధ్రువీకరించిన ఫారం–1, పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరించిన ఫారం–2, మీ భూమి అడంగల్, వన్– బీ కాపీలతో పాటు నాన్ మున్సిపాలిటీ స్టడీ సర్టిఫికెట్లు జత చేయాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు, ఫీజు చెల్లింపు రసీదు జత చేసి ఈ నెల 10 సాయంత్రంలోపు ‘‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, లాం, గుంటూరు–522034’’ చిరునామాకు చేరేలా రిజిస్టర్ పోస్టు చేయడం లేదా నేరుగా అందజేయవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1,000 రుసుం చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం విశ్వ విద్యాలయం వెబ్‌సైట్ anfrau.ac.in లేదా 81257 29592, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు.


