● పోలీసుల అదుపులో కేటుగాళ్లు
అనంతపురం సెంట్రల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పుల్లయ్య బుధవారం మీడియాకు ఆ వివరాలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం చెంచుగారిపల్లికి(ప్రస్తుతం దేవహనహళ్లి, బెంగళూరులో ఉంటున్నాడు) చెందిన కొర్రా విజయనాయక్, అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీమ్ మిల్, తాడిపత్రికి చెందిన పల్లా నారాయణస్వామి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. డీఆర్‌డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఏఆర్‌ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే రిజర్వ్‌బ్యాంకులో తమకు రూ.కోట్ల డబ్బు ఉందని, విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, తొలుత డబ్బులు ఇస్తే తిరిగి ఎక్కువ ఇస్తామని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా నగరంలోని అరవింద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఎన్‌ఏఆర్‌ఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడ కోసమంటూ రూ. 6 లక్షలు చొప్పున మొత్తం రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఆదర్శనగర్ సమీపంలో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో కొర్రా విజయ్‌కుమార్, షేక్ ముజీమ్ మిల్‌ను అరెస్ట్ చేశారు. పల్లా నారాయణస్వామి అలియాస్ బన్ని పరారీలో ఉన్నట్లు సీఐ పుల్లయ్య పేర్కొన్నారు.


