● ఘోరంగా డీఎస్సీ నిర్వహణ
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ
వజ్రకరూరు: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష నిర్వహణ అత్యంత ఘోరంగా జరిగిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. శనివారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. డీఎస్సీ పేపర్ తయారు చేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్షలు రాయించి అక్రమాలకు తెరతీశారని, దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలు, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువత, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులపై అణచివేత చర్యలు దుర్మార్గం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై అణచివేత చర్యలు చేపట్టడం దుర్మార్గమని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అణచివేయాలని భావించడం సరికాదన్నారు. దేశంలో విద్యావ్యవస్థ పనితీరు అధ్వానంగా మారిందని విమర్శించారు. నీట్–యూజీ పేపర్ లీక్‌పై చేపట్టిన పోరాటానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్నారన్నారు. 10 సంవత్సరాల్లో దాదాపు 150 సార్లు నీట్‌తోపాటు వివిధ పరీక్షల పేపర్లు లీక్ కావడం ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోవేదన మిగులుతోందని వాపోయారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే అప్రమత్తమై రాజీనామా చేసి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేదే కాదని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ.వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, వజ్రకరూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉస్మాన్, జిల్లా నాయకులు రాకెట్లబాబు, రఘుపతి తదితరులు ఉన్నారు.


