వైద్యం అందక వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యం అందక వృద్ధుడు మృతి

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ వృద్ధుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నార్పలకు చెందిన లక్ష్మీనారాయణ (60) కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను 108 అంబులెన్స్‌ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. వాహనం దిగి నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకున్న లక్ష్మీనారాయణకు చికిత్స చేయండని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. అయితే కొంతసేపటి తర్వాత వైద్యులు ఈసీజీకి రెఫర్‌ చేశారు. ఈలోపు పరిస్థితి విషమించింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఆక్సిజన్‌ అందజేస్తూ సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోవడంతో లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రాణం విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోవాల్సి వచ్చిందంటూ ఏఎంసీ వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి 9 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అవుట్‌పోస్టు ఎస్‌ఐ రవి, టూటౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement