అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ మహమ్మారి కనిపించకూడదని, డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్‌తో కలిసి కలెక్టర్ నార్కోటిక్ కో–ఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుక్కరాయసముద్రం చెరువు కట్ట దిగువన ఉన్న పార్కును వినియోగంలోకి తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసు శాఖ, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు పాఠశాల యాజమాన్యం పూర్తి సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వలిబాషా, ఈగల్ నోడల్ అధికారి జయపాల్‌రెడ్డి, ఎస్‌ఐ హనుమంతు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇళ్లకు వెళ్తే నిలదీస్తారు’
రాయదుర్గం రూరల్: ‘మనం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ఇప్పటికే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటింటికీ వెళితే కచ్చితంగా నిలదీస్తారు’ అంటూ ఏకంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సభలోనే ఆ పార్టీ నాయకుడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 74 ఉడేగోళం మద్దానేశ్వర స్వామి కల్యాణమండపంలో శనివారం కాలవ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఇంటినీ సందర్శించి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే రాయదుర్గం మండలం బీఎన్ హళ్లికి చెందిన టీడీపీ నాయకుడు కాటా వెంకటేశులు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,500, అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు పంటల బీమా బకాయిలు, వితంతు పింఛన్, తల్లికి వందనం తదితర విషయాలపై బాధితులు నిలదీస్తారని అనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ చిన్నచిన్న సమస్యలపై ప్రశ్నిస్తే పరిష్కరిస్తామని సమాధానం చెప్పాలనడం గమనార్హం.
లోకేష్ రాజీనామా ఎప్పుడు?
అనంతపురం: ‘నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదే తరహాలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు ప్రశ్నించారు. విద్యార్థి, నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలన్న డిమాండ్లతో పాటు ‘నీట్’ అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.


